జయహో పీవీ, మన్మోహన్‌ : ఇవాళ దేశ ఆర్థిక స్వాతంత్ర్య దినం

మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది.. ఈ ప్రశ్ని చిన్న పిల్లవాడిని అడిగినా ఆగస్టు 15, 1947 అని చెబుతారు. అలాగే రిపబ్లిక్ దినోత్సవం అంటే జనవరి 26, 1950 అని చెబుతారు. కానీ మన దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం ఎప్పడు వచ్చింది అంటే.. ఏం చెబుతారు.. అసలు ఈ ఆర్థిక స్వాతంత్ర్యం ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ.. మన దేశ అభివృద్ధిలో కీలకమైన ఆర్థిక స్వాతంత్ర్యం మాత్రం ఇవాళే అంటే జూలై 24నే వచ్చింది. అదీ సరిగ్గా 30 ఏళ్ల క్రితం.. అంటే  1991 జులై 24న భారత దేశానికి ఆర్థికంగా స్వాతంత్ర్యం వ‌చ్చిందన్నమాట.

మరి ఈ జూలై 24, 1991 ప్రత్యేకత ఏంటి.. ఎందుకు ఆరోజునే ఆర్థిక స్వాతంత్ర్యదినంగా చెప్పుకోవచ్చు.. ఎందుకంటే ఆరోజే భారత అభివృద్ధిలో కీలకమైన సంస్కరణలను పార్లమెంట్ ఆమోదించింది.. సరిగ్గా 30 ఏళ్ల కిందట ఇదే రోజు సమర్పించిన బడ్జెట్ దేశంలో ఆర్థిక సంస్కరణలకు పచ్చజెండా ఊపింది. ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌లు కృష్ణార్జునులుగా ఆర్థిక రథం అప్పటి నుంచి పరుగులు తీసింది. అప్పటి వరకూ ఉన్న పర్మిట్‌ రాజ్‌, లైసెన్స్ రాజ్‌లకు చెల్లు చీటీ పాడింది. ఎందుకంటే.. 1991 నాటికి మనది క్లోజ్డ్ ఎకానమీ. అంటే ప్రతి రంగం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేవి. ఎలాంటి నిర్ణయమైనా ప్రభుత్వం చేతుల్లోనే ఉండేవి.

ఈ 1991 బడ్జెట్‌లో తొలిసారిగా ఓపెన్ ఎకానమీకి బాటలు పరిచారు. ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు. దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచేందుకు  లైసెన్సింగ్ రాజ్ కు చరమగీతం పాడారు. అప్పటి నుంచే కంపెనీలు పర్మిట్ల నుంచి విముక్తి పొందాయి. ఎగుమతులను ప్రోత్సాహం లభించింది. దిగుమతి లైసెన్సింగ్‌లో అనేక సడలింపులు ఇచ్చారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతి కోసం ఐటీ చట్టం సెక్షన్ 80 హెచ్‌హెచ్‌సి కింద పన్ను మినహాయింపు ఇచ్చారు.

అలా 1991 బడ్జెట్‌ దేశ చరిత్రను తిరగరాసింది. దేశ ప్రగతి చక్రాలను ఉరకలెత్తించింది.. ఈనాడు అనేక ప్రైవేటు సంస్థలు ఏర్పడడం.. లక్షల ఉపాధి అవకాశాలు వెల్లువలా రావడం ఈ బడ్జెట్‌ పుణ్యమే అని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి.. జూలై 24 భారత దేశ ఆర్థిక స్వాతంత్ర్యదినం అంటే అతిశయోక్తి కాదు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

pv

సంబంధిత వార్తలు: