బలిపీఠంపై యడ్డీ బ్రతుకు చిత్రం!

LAXMAN
కుమారుడి దూకుడు రాజకీయాలు తండ్రి సీఎం పీఠాన్ని ఊడగొట్టి బలిపీఠంపై నిలబెట్టిందా? అవినీతి మరకలు ఉరితాడై ఉచ్చు బిగిసుకుంటుందా? అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం కర్నాటక రాజకీయాలు చూస్తుంటే! దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తొలి ముఖ్యమంత్రి, 78 ఏళ్ళ వయసులోనూ సమర్థవంతంగా పార్టీని నడింపించగల శక్తియుక్తులున్న నాయకుడు సీఎం బీఎస్ యడ్యూరప్ప. సంఘ్ బ్యాగ్రౌండ్ దండిగ ఉన్న కర్నాటక కాషాయనేతకు ప్రస్తుతం కుమారుడి చర్యలు శిరోభారంగా మారాయి. సొంతపార్టీ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలు యడ్డీ సీఎం కూర్చికి ఎసరు పెట్టాయి. పదవీ నుంచి తప్పించే వరకు కాషాయ కేడర్ పట్టినపట్టు వదిలేలా లేరు అన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గతవారం రోజులుగా కర్నాటక రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం మార్పు విషయం వాడీవేడి చర్చ సాగుతోంది. యడ్డీకి పదవీ గండం ఖాయమని సొంతపార్టీ నేతలే కొడై కూస్తున్నారు. రాజకీయాల్లో ఉద్దండైన యడ్డీ నేడు ఇలా ఢీలా పడిపోవడానికి కారణాలేమిటి? నాయకత్వమార్పుకు సొంత పార్టీ నేతకు పట్టుపడటంపై ఆంతర్యం ఏమిటి? ఈ నెల 26 న యడ్డీ రాజీనామ చేస్తాడా? అలా చేస్తే కర్నాటకలో తరువాత సీఎం ఎవరు? అన్న ప్రశ్నలు సర్వత్ర ఉత్కంఠతను రేకేత్తిస్తున్నాయి.
యడ్యూరప్ప .. కన్నడ గడ్డపై కాషాయాన్ని రెపరెపలాడించి బలయైన ఆర్ఎస్ఎస్ నేత. అనేక మంది కార్యకర్తలను నాయకులగా తీర్చి అసెంబ్లీకి,పార్లమెంట్ కు నడింపించిన నేత. ప్రస్తుత రాజకీయాల్లో ఆ నేత తన సీటును కాపాడుకోలేక చేతులెత్తిస్తున్న పరిస్థితి దాపురించింది. సొంత గూటి నుంచే ధిక్కార స్వరం విపక్షాల కన్నా మిన్నగా వినిపిస్తూ .. యడ్డీని పదవీ నుంచి తప్పించే వరకు ఊరుకునేలా లేరు. పార్టీలో కొంతమంది నేతలు ముఖ్యమంత్రిపై, ఆయన కుమారుడు విజయేంద్రలపై అవినీతి ఆరోపణలను సాక్ష్యాలతో సహా గుప్పించడం కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. బీజేపి ఎమ్మెల్సీ విశ్వనాథ్ .. యడ్డీ కుమారుడు విజయేంద్ర అవినీతిని బాహటంగా ఎత్తిచూపుతూ ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్నారు. అర్థికశాఖ అనుమతి లేకుండా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ. 27 వేల కోట్ల మేరకు టెండర్లుకు ఆహ్వానించారని ఆరోపించారు. ఈ టెండర్లలో కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందుకున్నారని విమర్శించారు. అంతేకాక అన్ని శాఖల్లో జోక్యం చేసుకోవడంతోపాటు జిందాల్ స్టీల్ ప్లాంట్ విస్తరణకు 3 వేల 667 హెక్టార్ల భూమిని చౌకధరకే కట్టపెట్టడానికి సిద్దమయ్యారని వివరించారు. విజయేంద్ర అక్రమాల్లో జేడీఎస్, కాంగ్రెస్ లకు కూడా వాటాలేకపోలేదని, అందుకు వారు వీటిపై నోరు మెదపడంలేదని ఎద్దేవా చేశారు.
ఇవన్నీ ఇలా ఉంటే యడ్యూరప్ప ఢిల్లీ పర్యాటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అమిత్ షా కలిసిన నాటి నుంచి కర్నాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జి అరుణ్ సింగ్ అవినీతి ఆరోపణలపై సమగ్రంగా అంతర్గత విచారణ జరిపి నివేదికను అధిష్టానంకు సమర్పించారు. అయితే ప్రస్తుతం యడ్డీ సీఎం పీఠంపై కొనసాగుతారా? లేక ఈ నెల 26 తో రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం పదవీకి రాజీనామా చేస్తారా? అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే సీఎం పదవీకి యడ్యూరప్ప రాజీనామా చేస్తే రేసులో చాలా మంది సీనియర్లు ఆ పీఠం కోసం ఢిల్లీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుపేర్లు తెరపైకి వచ్చినప్పటికీ .. మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బ్మో, ఆర్. అశోక్, సిఎన్ అశ్వత్థ నారాయణ్, మాజీ సీఎం జగదీష్ షెట్టర్, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎం మార్పు విషయంలో ఇంకా బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: