కూలిన శిథిలాలపై రాజకీయ పునాదులు!

LAXMAN
నాడు చంద్రబాబు, నేడు జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక తప్పిదాలకు తెరతీస్తున్నారా? చంద్రబాబు అప్పుడు చేసిన తప్పిదాలు శాపాలైతే .. నేడు జగన్ చేస్తుంది కూడా అదేనా? అంటే అవుననే తెరపైకి వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఏపిలో రాజుకుంటున్న కొత్త వివాదం చూస్తుంటే! ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అన్ని దారులు మూసుకుపోయి కొత్తగా తాడేపల్లిలో కూలిన పేదల ఇళ్లు చుట్టు తిరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రతిపక్షనేత చంద్రబాబు గుళ్లు కూలిస్తే .. ప్రస్తుత ముఖ్యమంత్రి ఇళ్లు కూలుస్తున్నాడని ఏపి వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణానది పుష్కరాల సమయంలో నది సుందరీకరణలో భాగంగా కరకట్టపై ఉన్న సనాతన ఆలయాల కూల్చిన ఘనత మాజీ సీఎం చంద్రబాబు అయితే .. నేడు సీఎం జగన్ తాడేపల్లి అమరారెడ్డి కాలనీలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని పేదలు ఇళ్లు కూలుస్తున్నాడు! అన్నది బీజేపీ, వామపక్షాల విమర్శలు.
2016 పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు కరకట్టపై ఉన్న ఇబ్రహీంపట్నం నుంచి కంకిపాడు వరకు ఉన్న 42 ఆలయాలను కూల్చారు. ఆధునీకరణకు అడ్డుగా ఉన్నాయని హిందూ దేవాలయాలను అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా కూల్చిశారని హిందూ ధార్మిక సంఘాలు అప్పట్లో దుమ్మెత్తిపోశాయి. ఆ ఆందోళన సెగలు ఎలా కాలగర్భంలో ఎలా కలిశాయో .. ఆస్థాయిలోనే తదననంతరం మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంచనాలకు మించిన సీట్లతో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యారు. నవరత్నాలు, సంక్షేమ పథకాలను క్యాలెండర్ వైజ్ గా పెట్టి  అమలు చేస్తూ తనదైన మడమ తిప్పని మార్కును నిరూపించుకునే ప్రయత్నంలో ప్రస్తుతం పట్టుదలతో పాలన సాగిస్తూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో తాడేపల్లి కరకట్టపై ఇళ్లు కూల్చివేత ఇష్యూ రాజకీయంగా ఊపందుకుంది.  
తాడేపల్లి ముఖ్యమంత్రి జగన్ నివాసం వెనకాల ఉన్న అమరారెడ్డి కాలనీలో ఎన్నో ఏళ్లుగా 321 కుటుంబాలు నివాసముంటున్నాయి. ముఖ్యమంత్రి భద్రత కారణాల దృష్ట్యా కాలనీలోని ఇళ్లును తొలగించి, వారికి వేరే చోట ఇళ్లు మంజురు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అమరారెడ్డి కాలనీ వాసులకు ఆత్మకూరులో  నివేశ స్థలాలను కేటాయించి, ఇళ్లు మంజురు చేశారు అధికారులు. 277 మంది కుటుంబాలు అక్కడికి వెళ్లేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మిగతావారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో సరైన న్యాయం జరగలేదని, నిరాశ్రయులకు అదనపు పరిహారం ఇవ్వాలని శివశ్రీ తోపాటు మరి కొందరు కాలనీవాసులు కేటాయింపులను వ్యతిరేకించారు. కాలనీలో ఇంకా అనేక కుటుంబాలు నివాసముంటున్నారని, నష్టపరిహారం ఇచ్చేవరకు ఖాళీ చేసేది లేదని కాలనీవాసులు కొందరు శివశ్రీతో పాటు నిరసనకు దిగారు. ఇది ఇలా ఉంటే గత రెండు రోజుల నుంచి ఖాళీ చేసిన ఇళ్లును కూల్చే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.

ఇదిలా ఉంటే మరోపక్క ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తున్న వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంటే, 124 కుటుంబాలే స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేశారని, మిగతా వారంతా ఇళ్లు ఇంకా ఖాళీ చేయలేదని వామపక్షాలు చెప్పుకొస్తున్నాయి. ఇలా కూల్ గా ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే దీనిపై కోర్డుకు వెళ్లి స్టే తెచ్చే పనిలో కొందరుంటే, రాజకీయ పట్టుకు మరికొందరూ కాలనీవాసులతో మంతనాలు జరిపి న్యాయం చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఇలా ఏపిలో రాజకీయాలు అప్పట్లో కూలిన గుళ్లతో ప్రారంభమై .. ప్రస్తుత కూలుతున్న ఇళ్ల శిథిలాల చుట్టూ తిరుగుతూ.. చివరికి హైకోర్టు మెట్లెక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: