అక్క‌డ మిగిలిందేమీ లేదు.. "కులం" ఒక్క‌టే

Garikapati Rajesh

అక్క‌డ గ‌ల్లంత‌వ‌డానికి ఏమీ మిగిలిలేదు.. అక్క‌డ పోవ‌డానికి, పారేసుకోవ‌డానికి కూడా ఏమీ లేవు.. అక్క‌డేం జ‌రుగుతుందో అక్క‌డివారికే అర్థంకావ‌డంలేదు.. అక్క‌డ ఏముంద‌ని చెబుతున్నారో అదైతే లేదు.. అక్క‌డి నుంచి ఎక్క‌డికెళ్లినా హాయిగా బ‌త‌కొచ్చ‌నే ఆశ మాత్రం అక్క‌డివారిని స‌జీవంగా ఉంచుతోంది.. అక్క‌డ ఎడారి లేదు.. కానీ ఎడారిలా అయిపోయింది.. అక్క‌డ నీటికి లోటు లేదు.. కానీ నాగ‌రిక‌త వెన‌క‌బ‌డింది.. అక్క‌డ కొనుగోలు శ‌క్తి ఎక్కువే.. కానీ కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే అక్క‌డ ఎన్నో ఉన్నాయి. అదే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం.
చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగిన టీఆర్ ఎస్ భ‌వ‌న్‌
హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా పాడి కౌశిక్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే కార్య‌క్ర‌మంలో మాట్లాడిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆంధ్రాలో ఏమీ మిగ‌ల్లేద‌ని, మొత్తం గ‌ల్లంతైంద‌ని, ఒక్క తెలంగాణ‌లోనే అభివృద్ధి ఉంద‌ని చెప్పారు. కేసీఆర్ ఈ మాట అన్న‌ప్పుడు టీఆర్ ఎస్ భ‌వ‌న్ మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగింది. ఆంధ్రాలో అంతా గ‌ల్లంతే అన్న‌దానికి వ‌చ్చిన స్పంద‌న అది. తెలంగాణ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది అన్న‌ప్పుడు కూడా ఆ స్పంద‌న రాలేదు. ఒక వ్యాపార‌వేత్త‌కు మ‌రో వ్యాపార‌వేత్త పోటీగా ఉన్న‌ప్పుడు.. కాల‌క్ర‌మంలో ఒక వ్యాపార‌వేత్త దివాలా తీస్తే ఎదుటి వ్యాపారి ఎంత ఆనందంతో ఉంటారో కేసీఆర్ కూడా అదే త‌ర‌హా ఉత్సాహాన్ని క‌న‌ప‌రుస్తున్నారు. ఆయ‌న ఈ మాట‌ల‌న్న త‌ర్వాత సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున నెటిజ‌న్లు ట్రోలింగ్ ప్రారంభించారు.
ఏపీకి వ్య‌తిరేకంగా నెటిజ‌న్ల ట్రోలింగ్‌
ఆ ట్రోలింగ్ కేసీఆర్ కు వ్య‌తిరేకంగా కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా. రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా త‌యారైంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఏపీ సర్కార్ కనీసం స్పంద‌న లేకుండా ఉంది. కేసీఆర్ అన్న‌మాట‌ల్లో నిజం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అంద‌రూ ముందుకు వ‌స్తున్నారుకానీ ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి మాత్రం ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు. ప్ర‌జ‌ల ఆస్తుల విలువ‌ను పెంచ‌డం, వారిని అభివృద్ధి చేయ‌డంపై ప్ర‌భుత్వం దృష్టిసారించి విజ‌య‌వంత‌మైంది. ప్ర‌భుత్వం కూడా ఆ విజ‌న్‌తోనే ముందుకు వెళుతోంది. కానీ ఏపీలో మాత్రం దివాలా ఆలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల ఖాతాల్లోకి డ‌బ్బులు మ‌ళ్లించ‌డంద్వారా ఇంట్లో కూర్చొని ప‌రిపాల‌న చేస్తూ ప్ర‌జ‌ల‌ను అష్ట‌కష్టాల‌పాల్జేస్తోంది. ఏపీలోని ప్ర‌జ‌లకు కూడా కుల‌మే ముఖ్యం. ఆ కులం గుజ్జు బుర్ర‌లో నిండుగా ఉన్నంత‌కాలం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌రీతిలో ఏపీ అభివృద్ధి ఉంటుంద‌నే మాత్రం సుస్ప‌ష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag

సంబంధిత వార్తలు: