ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఈమధ్య తరచూ ఓమాటంటున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డిది గాలివాటం గెలుపని. గాలివాటంగా గెలిచిన జగన్ అదే గాలికి కొట్టుకుపోతారంటూ జూమ్ కాన్ఫరెన్సులో తన నేతలతో పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు మాటలు విన్నతర్వాత జగన్ పై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఎంతటి అక్కసు పేరుకుపోయిందో అందరికీ అర్ధమైపోతోంది. కష్టపడి గెలిచినా, గాలివాటంగా గెలిచినా జగన్ గెలుపు గెలుపే అన్న విషయాన్ని చంద్రబాబు అంగీకరించలేకపోతున్నారు. అందుకనే 151 సీట్ల అఖండ మెజారిటితో గెలిచిన జగన్ను చాలా తక్కువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు. సరే చంద్రబాబు మాటలు ప్రత్యర్ధుల విషయంలో ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి ఇపుడు కొత్తగా ఏమీలేవు. కాకపోతే 2014లో చంద్రబాబు గెలుపు, 2019లో జగన్ గెలుపులో ఎవరిది నిజంగా గాలివాటం గెలుపు అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.
ఒకసారి 2014 ఎన్నికల్లోకి వెళదాం. రాష్ట్ర విభజన నేపధ్యం లాంటి ప్రత్యేక పరిస్దితుల్లో జరిగిన ఎన్నికలవి. ఎన్నికల సమయంలో జగన్ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. కానీ ఆశ్చర్యంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. జగన్ కు అధికారం 1.6 శాతం ఓట్ల తేడాతో తృటిలో తప్పిపోయింది. అందుకు కారణాలు ఏమిటి ? ఏమిటంటే చంద్రబాబుకు అండగా ఒకవైపు బీజేపీ మరోవైపు జనసేన నిలిచాయి. అప్పటికే నరేంద్రమోడికి మద్దతుగా బీసీ సామాజికవర్గాలు దేశంలో పోలరైజయ్యున్నాయి. మోడికి మద్దతుగా నిలిచిన వర్గాలన్నీ బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీకి ఓట్లేశాయి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు కారణంగా రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం టీడీపికి ఓట్లేశాయి. ఇవికాకుండా రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కాపులను బీసీల్లోకి చేరుస్తామనే హామీలతో చంద్రబాబు ఎన్నికల్లో అతికష్టం మీద నెగ్గారు. మరి వైసీపీని తీసుకుంటే ముగ్గురు ప్రత్యర్ధులపై జగన్ ఒంటరిపోరాటం చేశారు.
సీన్ గిర్రున తిరిగి 2019 ఎన్నికలు వచ్చేసరికి 2014లో ఒంటరిపోరాటం చేసిన జగన్ మళ్ళీ ఒంటిరి పోరుకే రెడీ అయ్యారు. 2014 ఎన్నికల్లో రెండు బలమైన వర్గాల మద్దతుతో పోటీ చేసిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఒంటరిపోరాటం చేయాల్సొచ్చింది. చంద్రబాబు ఒంటరిపోరాటం ఏమైంది ? ఏమైందంటే చిత్తుచిత్తుగా ఓడిపోయారు. తనకు మద్దతుగా ఎవరోకరు నిలబడకపోతే ఏ ఎన్నికలోను గెలవలేనని చంద్రబాబు తనంతట తానే బయటపెట్టుకున్నారు. తన గెలుపంతా తన మద్దతుదారుల మీదే ఆధారపడుంటుందనే విషయాన్ని లోకానికి అర్ధమయ్యేట్లు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవటానికి మళ్ళీ బీజేపీ మద్దతుకోసం పాకులాడుతున్నారు. మరి చంద్రబాబు, జగన్ గెలుపులో ఎవరిది గాలివాటం ? ఎవరిది రెక్కల కష్టం ?