ఇంటర్‌ పరీక్షలకు చకచకా ఏర్పాట్లు!

N.Hari
తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర విద్యాశాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 25 నుంచి నిర్వహించబోయే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అలాగే ఈ విషయంగా 33 జిల్లాల కలెక్టర్లతో, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా మంత్రి నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరీక్ష రాయబోయే 4.50 లక్షలకు పైగా విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా ఉండేందుకు, పరీక్షలు సజావుగా సాగేందుకు కావాల్సిన చర్యలను తీసుకున్నారు. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను 1750కి పెంచారు. ఇన్విజిలేటర్ల సంఖ్యను కూడా 25 వేలకు పెంచడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఐసోలేషన్ రూమును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే.. వారిని ఐసోలేషన్ రూములో ఉంచుతారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక నర్సు లేదా డాక్టర్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు విద్యార్థులను సెంటర్ వద్ద దించేలాగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలను రాయాలని మంత్రి కోరారు.
ఇక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు సహకరించాలని, పరీక్షలు ముగిసిన తర్వాత చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. దీనికి స్పందించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల అసోషియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ మట్లాడుతూ- "గత రెండున్నర సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన రూ. 315 కోట్లు మేర స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో ప్రైవేట్‌ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. దీంతో భవనాలకు అద్దె చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక 300కు పైగా కాలేజీలు మూతపడ్డాయన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన హల్ టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకం తప్పనిసరి చేయాలని కోరారు. జీఓ నెంబర్ 112 ప్రకారం ట్యూషన్ ఫీజును పెంచాలని డిమాండ్ చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్షలు ముగిసిన తర్వాత సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. మొత్తంమీద ఇంటర్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ఈనెల 25 నుండి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: