ఆ వాహనాలపై పన్ను.. ప్రజలపైనా భారమే?

ఏపీ సర్కారు ఇటీవల సరుకు రవాణా వాహనాలపై 25 నుంచి 30 శాతం మేర త్రైమాసిక పన్ను పెంచింది. ఇది పరోక్షంగా ప్రజలపై పడే అవకాశం కనిపిస్తోంది. ఇది రవాణా రంగానికి అశనిపాతమేనని లారీ యజమానులు అంటున్నారు. నెలరోజుల తరవాత దీనిని అమలుచేస్తే రాష్ట్రంలోని రెండున్నర లక్షల లారీలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని లారీ యజమానులు పేర్కొంటున్నారు. రవాణా రంగానికి ఆయువుపట్టు అయిన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలపై సాలీనా 15 కోట్ల రూపాయల వరకు, మొత్తంగా సరకు, ప్రయాణికుల రవాణావాహనాలపై ఏటా 200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని లారీ యజమానులు చెబుతున్నారు.

త్రైమాసిక పన్నుపెంపు నిమిత్తం ప్రభుత్వానికి మూడు నెలల క్రితం రాష్ట్ర రవాణాశాఖ పంపించిన ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని లారీ యజమానులు  కోరుతున్నారు. సీఎం, రవాణాశాఖ ఉన్నతాధికారులకు లేఖలు పంపినా, వినతిపత్రాలు ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదని వాపోయారు. 2020-2021 సంవత్సరాల్లో కరోనా వల్ల తీవ్ర సంక్షోభం చవిచూసిన రవాణారంగాన్ని డీజిల్ ధరల పెరుగుదల కుంగదీస్తోంది. నానాటికీ ఆటుపోట్లతో, అంతంతమాత్రంగా ఉన్న రవాణారంగానికి త్రైమాసికపన్ను పెంపు చర్య గుదిబండగా మారనుంది.

పొరుగు రాష్ట్రాల్లో ఇక్కడి కంటే డీజిల్ ధరలు తక్కువగా ఉన్నందున పక్కరాష్ట్రాల కిరాయిలతో పోటీ పడలేక ఏపీ రవాణా రంగం డీలాపడుతోంది. త్రైమాసిక పన్ను పెంపుతో మరింత నష్టాల ఊబిలోకి జారుతుందనే విషయాన్ని రాష్ట్రప్రభుత్వం గుర్తించాలి. కరోనా కష్టకాలంలో పక్క రాష్ట్రాలు పన్ను మినహాయింపులు ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనవంతు కనీస ప్రోత్సాహకాలు రవాణారంగానికి అందించలేదని లారీ యజమానులు అంటున్నారు.

త్రైమాసిక పన్నుపెంపు యోచనపై నెలరోజుల్లో అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలపాలని, తర్వాత ఇది అమల్లోకి వస్తుందని తాజా నోటిఫికేషనులో పేర్కొన్నారు.  గతంలో లారీ ఓనర్ల సంఘాల అభ్యంతరాలు, లేఖలు, వినతిపత్రాలూ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా హరితపన్ను  200 రూపాయల నుంచి గరిష్టంగా 20వేల రూపాయల పైగా పెంచిందని లారీ యజమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: