2024 ఎన్నికలు అమరావతిపై రిఫరెండమ్‌ అవుతాయా?

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయకూడదనేదే వైసీపీ సర్కారు ఉద్దేశం. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. రాష్ట్ర రాజధానిగా విశాఖ పట్నమే ఉండాలని.. కేవలం శాసన రాజధానిగా అమరావతి అసెంబ్లీకే పరిమితం కావాలని వైసీపీ ఆలోచన. కర్నూలును న్యాయ రాజధానిగా.. విశాఖను కార్యనిర్వహక రాజధానిగా చేయాలనేదే జగన్ ఉద్దేశ్యం. అయితే అది ఆచరణలో ఆలస్యం అవుతోంది. టీడీపీ మాత్రం అమరావతినే ఏకైక రాజధానిగా చేయాలని పోరాడుతోంది. తాజాగా అమరావతి రైతులు అరసవల్లికి పాదయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు అమరావతిపై రిఫరెండమ్‌ అవుతాయంటూ మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. 2024 తో రాజధాని అంశానికి  ముగింపు పడుతుందని మంత్రి అమర్‌నాథ్ అంటున్నారు. అప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎన్నికలలో రెఫరెండమ్ అవుతాయని, ఆ ఎన్నికల్లో తీర్పు వైఎస్ ఆర్సీపికి అనుకూలంగా వస్తుందని మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ చెప్పారని.. అలాగే రాష్ట్రమంటే ఆ 29 గ్రామాలు కాదోయ్.. రాష్ట్రమంటే 26 జిల్లాలోయ్ అని చంద్రబాబు నాయుడు గుర్తెరగాలని మంత్రి అమర్నాథ్ చురకలు వేశారు.

అమరావతి నుంచి అరసవిల్లి వరకు యాత్ర దేవుని చూడటానికి ఐతే పర్వాలేదని.. మా ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదని మొక్కుతామంటే చూస్తూ ఉరుకోబోమని మంత్రి అమర్నాథ్ అంటున్నారు. పూర్వపు అమరావతి దేవతల ప్రాంతం కావచ్చేమో కానీ ఇప్పుడు  అమరావతి మాత్రం దెయ్యాల అమరావతి అంటున్నారు మంత్రి అమర్నాథ్ . శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఈ ప్రాంతం వెనుకబడి ఉందని నివేదికలో ఇచ్చారని.. ఈ ప్రాంతానికి ఏ రోజు చంద్రబాబు మేలు చెయ్యలేదని మంత్రి అమర్నాథ్  అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకూ.. అమరావతి బిజినెస్ క్లాస్ మనుషులకు జరుగుతున్న పొరాటమిది అంటున్న మంత్రి అమర్నాథ్ .. ఈ ప్రాంతానికి వచ్చి మా కడుపు కొడతామంటే చూస్తూ ఉరుకోడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: