కేసీఆర్‌ పాలనలో.. ఇదీ ఒక ప్రభుత్వ ఉద్యోగమేనా?

ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు.. జీవితంలో సెటిల్ అయినట్టే అని అంతా అనుకుంటారు. కానీ.. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పాలకుల పుణ్యమా అని చాలా దారుణంగా తయారయ్యాయి. అలాంటి వాటిలో వీఆర్‌ఏ ఒకటి.. దాదాపు 8,9 ఏళ్ల క్రితం ఉమ్మడి ఏపీలో వీఆర్వో ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంది గ్రాడ్యుయేట్లు కూడా ప్రభుత్వ ఉద్యోగం కదా అని దీనికి అప్లయి చేసుకున్నారు. సొంత ఊళ్లో ఉద్యోగం కదా.. జీతం తక్కువైనా పర్లేదనుకున్నారు.

అలా కొన్ని వేల మంది వీఆర్‌ఏలుగా ఎంపికయ్యారు. రెవెన్యూ జాబ్‌ కాబట్టి ప్రమోషన్లు వస్తాయని.. కాస్త ఆలస్యమైనా జీవితం బావుంటుందని ఆశపడ్డారు. కానీ.. వారి ఆశలు అడియాశలయ్యాయి. వీఆర్ఎల బతుకులు క్రమంగా అగమ్యగోచరంగా మారాయి. ఇప్పుడు వారి అకాల మరణాలు, ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. ప్రభుత్వం వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది.

రెండు, మూడేళ్ల క్రితం సాక్షాత్కూ సీఎం కేసీఆరే వారికి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇక వారి  సమస్యలను  పరిష్కరిస్తామని.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. పేస్కేల్ ఇస్తామని.. అసెంబ్లీలో హామీ ఇచ్చారు. అవి చూసి వీఆర్ఏలు  ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ జీవితాలు మారిపోతాయని అనుకున్నారు. పే స్కేల్‌ ఇస్తే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా జీతం వస్తుందని ఆశ పడ్డారు. ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా తమ జీతాలు కూడా పెరుగుతాయని ఆశపడ్డారు.

చివరకు సీఎమ్మే మాట తప్పారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయాలని భావించట్లేదు. ముఖ్యమంత్రి మాటకే విలువ లేకపోయే సరికి గత్యంతరం లేక వారు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలు సమ్మె బాట పట్టారు. వారి సమ్మె 50 రోజులకు చేరింది. తమ భవిష్యత్ ఏమవుతుందో అన్న బెంగతో ఇప్పటి వరకూ 28 మంది వీఆర్‌ఏలు చనిపోయారు. అంటే రెండు రోజులకు ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారన్నమాట. మరి ఈ కుటుంబాలకు దిక్కెవరో చెప్పాలి.. మాట ఇచ్చిన తప్పిన పాలకులే ఈ చావులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా.. మరి సీఎం కేసీఆర్ ఇకనైనా వీఆర్‌ఏల సమస్యల గురించి పట్టించుకుంటారా.. ఇకనైనా వారికి న్యాయం చేస్తారా.. ఏమో.. ఏం చేస్తారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vra

సంబంధిత వార్తలు: