కేసీఆర్‌.. వీఆర్‌ఏల ఆత్మహత్యలు పట్టించుకోరా?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దాదాపు 50 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్‌ఏల గురించి కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. వీఆర్ఏలు గత 48 రోజలుగా సమ్మె చేస్తున్నారని.. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని... అయినా మీ రాక్షస ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత బాధాకరమని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్‌ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న మీరు హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇకపై వీఆర్వోలు ఉండరని... విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలు చేస్తామని... ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తామని మీరు ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పిన విషయం ఏమైందని గుర్తు చేశారు.
వీఆర్ఏల బతుక్కు భరోసా ఇవ్వలేని మీరు భారదేశాన్ని ఉద్దరిస్తారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు.  వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శేషాద్రి ఛైర్మన్ గా నియమించిన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని రేవంత్ రెడ్డి  గుర్తు చేశారు. అంటేనే అది కంటి తుడుపు కమిటీ అని అర్థమవుతోందని... ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా అని రేవంత్ రెడ్డి  నిలదీశారు.

చివరకు వీఆర్ఎలు వాళ్ల సమస్యల పరిష్కారం కోసం రోడెక్కే పరిస్థితి వచ్చిందని... దీనికి ప్రధాన కారణం మీరేనని... ఇప్పటికైనా వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి  డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వీఆర్ఎల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్ధతుగా నిలుస్తుందని.. వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని రేవంత్ రెడ్డి  అన్నారు. వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలని.. అర్హులైన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించాలని.. సొంత గ్రామాల్లో వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని.. సమ్మె కాలంలో, విధి నిర్వహణలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఎల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని.. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ రెడ్డి  లేఖలో డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: