చిరంజీవితో కృష్ణంరాజు.. గుర్తు చేసుకున్న పవన్‌ కల్యాణ్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు అంటూ పవన్ కల్యాణ్‌ నివాళులు అర్పించారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించిందని పవన్ కల్యాణ్  అన్నారు.

ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించానన్న పవన్ కల్యాణ్ .. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. తమ కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయని... 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో కృష్ణంరాజు గారితో కలసి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నటించారని  పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారన్న పవన్ కల్యాణ్.. ‘భక్త కన్నప్ప’లో  కృష్ణంరాజు గారి అభినయం ఎంతో ప్రత్యేకమని..  అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారని గుర్తు చేసుకున్నారు.

బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి సినిమాలు కృష్ణంరాజు శైలి నటనను చూపాయని.. పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.  ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారని... కేంద్ర మంత్రిగా సేవలందించారని.. పవన్ కల్యాణ్  నివాళులు అర్పించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారని.. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివని పవన్ కల్యాణ్  ప్రశంసించారు.

శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నానన్న పవన్ కళ్యాణ్.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరిగే అవకాశం ఉంది. ఇందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: