ఏపీ: ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని బిల్లు?

విశాఖను రాజధాని చేసేందుకు జగన్ ముహూర్తం నిర్ణయించారా..  వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ రాజధానిగా మరోసారి బిల్లు ప్రవేశపెడతారా.. మూడు రాజధానుల బిల్లును ఇప్పటికే ఉపసంహరించుకున్న జగన్ సర్కారు.. మరో సారి పకడ్బందీగా రాజధాని బిల్లు తెచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలోని రెండు సభల్లోనూ వైసీపీకి ఫుల్ మెజారిటీ ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లో శాసన మండలిలో టీడీపీకే మెజారిటీ ఉంది.. ఈ కారణంగా మూడు రాజధానుల బిల్లు మండలిలో పాస్ కాలేదు.

దాన్ని బలవంతంగా ఆమోదించాలని ప్రయత్నించడం.. ఈ క్రమంలో విషయం ఏపీ హైకోర్టుకు వెళ్లడం.. హైకోర్టు దాన్ని పెండింగ్‌లో పెట్టడం జరిగిపోయాయి. ఆ తర్వాత మేలుకున్న జగన్ సర్కారు శాసన మండలిలో  పెట్టిన మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. అందువల్ల ఇప్పుడు కొత్తబిల్లు పెట్టేందుకు అడ్డంకులు లేవు. తాజాగా మంత్రి అమర్‌నాథ్ త్వరలోనే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టబోతున్నామంటూ వ్యాఖ్యానించడం జగన్ ప్లాన్‌ కు సంకేతంగా చెప్పుకోవచ్చు.

అమరావతి రాజధాని వద్దని తాము చెప్పలేదంటున్న మంత్రి అమర్నాథ్‌.. అమరావతితో కూడిన రాజధానులు ఉంటాయన్నామని గుర్తు చేస్తున్నారు. 2020లో పెట్టిన రాజధానుల బిల్లుపై అభ్యంతరాలొచ్చాయని.. అందుకే మరోసారి నిర్ధిష్టంగా రాజధానుల బిల్లు ప్రవేశపెడతామని మంత్రి అమర్నాథ్‌ అంటున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై బిల్లు పెట్టొచ్చంటూ మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే జగన్ పాలనలో మూడేళ్లు పూర్తయ్యాయి. ఇంకా రెండేళ్ల కాలమే ఉంది. అందులోనూ చివరి ఏడాది ఎన్నికల ఏడాదిగా సరిపోతుంది. అంటే ఇంకా జగన్ చేతిలో ఉంది ఒక్క ఏడాది మాత్రమే.. అందుకే ఈ ఏడాదిలో రాజధానిని విశాఖకు మార్చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు అందుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో.. దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు టీమ్‌ ఏం చేస్తుందో.. చూడాలి మరి...?
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: