అమరావతి పాదయాత్రకు షాక్.. నో పర్మిషన్‌?

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల సమస్య వస్తుందన్న కారణంతో అనుమతి ఇవ్వలేదు. అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నిన్న అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను  అర్ధరాత్రి తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపారు. అనుమతి నిరాకరణకు పోలీసులు ఓ లాజిక్ చెబుతున్నారు.

అమరావతి రైతులు గతేడాది కూడా తిరుమల వరకు పాదయాత్ర చేశారు. అప్పుడు కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో పోలీసులు అనుమతిచ్చారు. కానీ పాదయాత్రలో అమరావతి రైతులు ఆ షరతులన్నీ ఉల్లంఘించారని.. అంతే కాకుండా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయపరిచారని.. వారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. గత పాదయాత్ర సమయంలో వివిధ జిల్లాల్లో అమరావతి రైతులపై 71 క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయని డీజీపీ గుర్తు చేశారు.

అంతే కాదు.. రెండు కేసుల్లో మీకు శిక్ష కూడా పడిందని..  ఇప్పుడు కూడా మహా పాదయాత్ర కోసం ప్రతిపాదించిన మార్గంలోని వివిధ ప్రాంతాల్లో మూడు రాజధానులపై వివిధ ఆకాంక్షలు ఉన్నాయని డీజీపీ గుర్తు చేశారు. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం కూడా మీ పాదయాత్ర మార్గంలో ఉన్నందువల్ల వివాదాస్పదం అవుతుందని డీజీపీ తెలిపారు.  200 మందితో పాదయాత్ర చేస్తామని చెబుతూనే... ఎంతమంది వస్తారన్నదానిపై మీకే నియంత్రణ ఉండదని డీజీపీ అన్నారు.

పాదయాత్రలో ఎవరు, ఎంత మంది పాల్గొంటారో తెలియనప్పుడు యాత్రను పర్యవేక్షించడం  అధికారులకు కష్టమవుతుందని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందువల్ల పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని.. యాత్రలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నందున వారికి భద్రత కల్పించడం చాలా కష్టమని డీజీపీ అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కోనసీమ అల్లర్లు, శ్రీకాకుళం జిల్లాలో గొడవలను డీజీపీ ప్రస్తావించి.. అందువల్ల అనుమతి ఇవ్వలేమని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: