పోలవరానికి మరో కొత్త అడ్డంకి.. ఇప్పట్లో కాదా?

పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఆ ప్రాజక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఏమీ చెప్పలేమని సాక్షాత్తూ మంత్రులే అంటున్నారు. అందుకు కారణంగా డయాఫ్రమ్ వాల్‌ పాడైపోవడమేనని.. దాన్ని చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యంగా కట్టారని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. కారణాలు ఏవైనా.. జరిగింది ఏదైనా.. పోలవరం పనులు మాత్రం చాలా నెమ్మదిగా సాగుతున్నాయన్నది వాస్తవం.

అంతే కాదు.. కేంద్రం కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి నిధులు విడుదల చేయడం లేదు. కేంద్రం నిధులిస్తే పరిహారం ప్యాకేజీ ఇస్తామని సీఎం జగన్ చెబుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. పోలవరం ప్రాజక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు వస్తున్నాయని ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

పోలవరం ప్రాజక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారని వీరు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా విస్తరించారని ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులకు, ప్రాజక్టు నిర్మాణానికి పొంతన లేదని ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదిస్తున్నాయి.

అందుకే.. ఈ పర్యావరణ అనుమతులపై పునః సమీక్ష చేయాలని ఆ రాష్ట్రాలు కోరుతున్నాయి. పోలవరం నిర్మాణం వల్ల భద్రాచలం ఆలయం ముంపుకు గురవుతుందని బిజెపి నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... ఈ విషయంలో వాస్తవాలతో కూడిని నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది. కేసుకు సంబంధించి అదనపు సమాచారంతో కూడిన పత్రాలు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని ఒడిశా, ఛత్తిస్‌ఘడ్‌, తెలంగాణ రాష్ట్రాలు  ధర్మాసనాన్ని కోరారు. మరి ఈ కేసు ఎప్పుడు తేలుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: