ఇండియాకు దమ్ముంటే.. బ్రిటన్‌ను ఆ విషయంలో దాటాలి?

ఇటీవల ఓ శుభవార్త విన్నాం.. ఇండియా ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బ్రిటన్‌ను అధిగమించి ఇండియా ఈ ర్యాంకు సాధించింది. ఇది నిజంగా చెప్పుకోదగ్గ ఘన విజయమే.. అదే బ్రిటన్‌ చేతిలో పీడనకు గురై.. బ్రిటన్ వలస పాలన ద్వారా కునారిల్లిన ఇండియా ఇప్పుడు అదే బ్రిటన్‌ను అధిగమించి ఆర్థికంగా పురోగమించడం అంటే మామూలు విషయం కాదు.. చెప్పుకోదగ్గ ఘన విజయమే.

అయితే.. అదే సమయంలో మనం బ్రిటన్‌తో పోల్చుకోవాల్సిన కీలకమైన అసలైన విషయం మరొకటి ఉంది. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్‌ రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన పార్టీ నుంచే మరొకరు ప్రధాని కావాల్సి ఉంది. అయితే..ఆ అధికార మార్పిడి ఎలా జరిగిందో చూశాం.. ప్రధానిగా బోరిస్ వారసుడి ఎంపిక కోసం బ్రిటన్‌లో పెద్ద కసరత్తే జరిగింది. మొదట తన పార్టీకి చెందిన ఎంపీలతో అంతర్గతంగా ఓటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత తన పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఓటింగ్ నిర్వహించారు.

ఈ ఓటింగ్‌ కు ముందు ప్రధాని పదవికి పోటీ పడుతున్న నేతలందరికీ డిబేటింగ్ అవకాశాలు ఇచ్చారు. చివరకు ప్రధాని పదవి రేసులో ఇద్దరు నిలిచారు. ఆ ఇద్దరు కూడా రోజుల తరబడి తమ వ్యూహాలను ప్రజలతో పంచుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలకు వివరించారు. ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. అందులో భారత సంతతి ఎంపీ రిషి సునాక్‌ కంటే.. లిజ్ ట్రస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. చివరకు ఆమె ప్రధానిగా ఎంపికయ్యారు.

ఒక పార్టీ నేతను.. ప్రధానిగా ఎన్నుకునేందుకు ఇంత చర్చ జరిగింది. అదే ఇండియాలో ఇలాంటి సీన్ ఊహించగలమా.. పార్టీలన్నీ ప్రైవేటు ప్రాపర్టీలుగా మారిపోయిన దుస్థితి మనది. ఒకే పార్టీలో ఇద్దరు నేతల మధ్య ఎంపిక కోసం ఇంత చర్చ అసలు ఇండియాలో సాధ్యమేనా.. ధనబలం, కండ బలం, మూకబలం.. ఇవేగా మన దగ్గర నేతలను ఎంపిక చేసే అంశాలు.. ఆర్థిక పరిమాణం విషయంలో కాదు.. ప్రజాస్వామ్య పరిణామంలో మనం బ్రిటన్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. కాదంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: