టీఆర్‌ఎస్‌ Vs బీజేపీ.. ఏందీ ఫోటోల లొల్లి?

తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌ రాజకీయం ముదురుతోంది. చివరకు ఫోటోల విషయంలోనూ రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. తమ స్థాయి మరిచి మరీ చిల్లర పంచాయతీలు పెట్టుకుంటున్నాయి. దీన్ని మొదలు పెట్టింది మాత్రం బీజేపీ అని చెప్పక తప్పదు. కేంద్ర ఆర్థిక మంత్రి స్థాయిలో తెలంగాణలో పర్యటించిన నిర్మలాసీతారామన్ రేషన్ షాపుల్లో మోడీ బొమ్మలేదంటూ రచ్చ రచ్చ చేయడం ఆమె స్థాయికి తగిన విషయం కానే కాదు.

దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్‌ దేశమంతటా కేసీఆర్ బొమ్మ పెట్టాలంటూ మరో వింత లాజిక్‌ చెబుతోంది.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు... కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు అసంబంధంగా ఉన్నాయంటున్నారు. కేంద్ర నిధులు ఉపయోగిస్తే మోదీ ఫోటో పెట్టాల్సిందే అని మాట్లాడటంలో ఔచిత్యం లేదని.. ఎన్డీఏ ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ హయాంలో గుజరాత్‌లో సీఎంగా ఉన్న మోదీ రేషన్‌ షాపుల్లో మన్మోహన్‌ సింగ్‌ ఫోటో పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు.

ఆనాడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టారా నిలదీసిన హరీష్‌రావు.. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడంలో సబబుగా లేదన్నారు. రాష్ట్రానికి వచ్చి మూడు విమర్శలు, ఆరు అబద్దాలు ఆడి రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకోదన్న హరీశ్ రావు.. తెలంగాణలో మీ పాచిక పారదని భాజపా గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రజలను మీ అవాస్తవాలతో గందరగోళ పరుద్దామనుకుని మీరే గందరగోళంలో పడ్డట్టు అర్థమవుతుందన్న హరీశ్ రావు.. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్ పైనా ప్రభుత్వ పథకాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారన్నారు.

ఇలాంటి కుట్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని బీజేపీ పార్టీకి, కేంద్ర మంత్రులకు సూచించిన హరీశ్ రావు.. అనవసర పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాల వాటా పెంచి మాపై భారం వేయడం తప్ప కేంద్రం చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు. పనికి ఆహార పథకం లాంటి మంచి పథకాలపై కొర్రీలు వేస్తూ, వాటికి నిధులు తగ్గిస్తూ, కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేశారని హరీశ్ రావు మండిపడ్డారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: