ఐయామ్‌ వెరీ లక్కీ అంటున్న చంద్రబాబు?

దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం అంటే సాధారణ విషయం కాదు.. అందులోనూ ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడికి ఆ అవకాశం అంత సులభంగా దక్కదు. కానీ.. కాలం కలసివస్తే..అలాంటి అద్భుతాలు సాధ్యం అవుతాయి. చంద్రబాబు తన విషయంలో అలాగే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 27 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన పాత విషయాలు గుర్తు చేసుకున్నారు.

తాను సీఎంగా ఉన్న సమయంలో తన ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే వాజ్ పేయి ప్రధానిగా  ఉండటం కలిసొచ్చిందని చంద్రబాబు అన్నారు. జాతీయ స్థాయిలో ఓపెన్ స్కై పాలసీ, టెలికాం పాలసీ, స్వర్ణ చతుర్భుజి రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లు, సూక్ష్మ సేద్యం వంటివి దేశానికి పరిచయం చేయడంలో తనకు కీలక పాత్ర వహించే అవకాశం రావడం తన అదృష్టంగా చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నారు. అబ్దుల్ కలాం వంటి వారిని రాష్ట్రపతిగా ఎంపిక చేసుకోవడంలో తన పాత్ర ఉండటం మధుర జ్ఞాపకమని చంద్రబాబు అన్నారు.

రంగరాజన్ వంటి వారిని గవర్నర్ గా ఏపీకి తెచ్చుకున్నామని.. తెలుగుదేశం నేతల్లో బాలయోగిని దేశానికి తొలి దళిత స్పీకర్ గా, ఎర్రన్నాయుడుని కేంద్రమంత్రిగా చేసుకున్నామని చంద్రబాబు ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 లోనూ ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇస్తే...లోటు బడ్జెట్ రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించి చూపించామని చంద్రబాబు అంటున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మించే కృషిచేసామని చంద్రబాబు అన్నారు.

కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ద్వారా నదుల అనుసంధానం అనే కీలక ప్రక్రియను మొదలు పెట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. అన్న క్యాంటీన్, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, విదేశీ విద్య, చంద్రన్న బీమా వంటి వినూత్న సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచామని చంద్రబాబు అంటున్నారు. ముఖ్యమంత్రిగా తాను ఏం చేసినా భావితరాల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం అయ్యిందన్న చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే.. అంతకు మించిన సంక్షేమ పథకాలు తీసుకొస్తానని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: