జగన్‌ను ఆ తప్పు వెంటాడుతుందా?

రాజకీయాల్లో ఒక్కొక్కకరిదీ ఒక్కో స్టయిల్ ఉంటుంది. కొందరు అభివృద్ధి మంత్రం జపిస్తారు.. మరికొందరు సంక్షేమ మంత్రం పాటిస్తారు. ఏపీ సీఎం జగన్‌ ది సంక్షేమ పథం.. సామాన్యుడి చెంతకు ప్రభుత్వ పథకాలు అందాలి.. వీలైనన్ని ఎక్కువ పథకాలు ప్రవేశ పెట్టాలి.. అనేది జగన్ పాలసీ.. అందుకు అనుగుణంగానే ఆయన గత ఎన్నికల ముందు తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఆ ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగానే ప్రచారం చేశారు. జనం కూడా ఆయన హమీలను నమ్మారు. జగన్ వస్తే సంక్షేమ రాజ్యం వస్తుందని ఆశించారు. అధికారం కట్టబెట్టారు.

అంత వరకూ ఓకే.. జగన్ కూడా తన మేనిఫెస్టోయే పరమావధిగా పాలన సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఇచ్చిన హామీలకు భంగం రాకుండా చూసుకుంటున్నారు. అప్పో సప్పో చేసైనా సరే.. ఏ పథకం కూడా ఆపకుండా కొనసాగిస్తున్నారు. అంత వరకూ ఓకే.. కానీ.. టీడీపీ ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్ పథకంపై జగన్ కక్ష వహిస్తున్నారన్న అభిప్రాయం నెలకొనేలా వ్యవహాహరించడం మాత్రం ఆయనకు చెడ్డపేరు తీసుకొస్తోంది.

గత ఎన్నికల ముందు చంద్రబాబు హడావిడిగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇది తెలంగాణలో అమలవుతున్న అన్నపూర్ణ పథకం తరహాలోదే. అన్న క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకే ఆహారం అందించడం పేదలకు ఉపయోగకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటిని విస్తరిస్తామని కూడా చెప్పారు. ఇంతలో ప్రభుత్వం మారింది.

జగన్ సీఎం కాగానే అన్న క్యాంటీన్లను మూసేయించారు. దీనివల్ల పేదల నోటికాడ బువ్వపోయినట్టయింది. అంతగా ఆ పథకం టీడీపీకి పేరు తెస్తుందని భావిస్తే.. రాజన్న క్యాంటీన్లను మార్చి కొనసాగిస్తే బావుండేది.. సరే.. ఆ పథకం అలా ఆగిపోయింది. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్లు వాళ్ల సొంత డబ్బుతో ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లను కూడా జగన్ సర్కారు అడ్డుకోవడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. పేదల నోటి కాడ కూడా  లాగేస్తారా.. మీరు పెట్టరు.. ఇంకొకల్ని పెట్టనివ్వరా అన్న తెలుగు దేశం నేతల ప్రశ్నలకు వైసీపీ నేతల నుంచి సమాధానాలు ఉండటం లేదు. ఏదేమైనా అన్న క్యాంటీన్లపై కక్ష కట్టడం జగన్‌ సర్కారుకు మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: