అనూహ్యంగా.. చైనాకు షాక్ ఇవ్వబోతున్న జపాన్‌?

చైనా.. పొరుగు దేశాలతో కయ్యం పెట్టుకోవడానికి ఎప్పుడూ ముందుండే దేశం.. అందుకే చైనాకు నిత్యం ఇటు భారత్‌తోనూ..అటు తైవాన్‌తోనూ.. హాంగ్‌కాంగ్‌తోనూ.. ఇంకా మరికొన్నిపొరుగు దేశాలతోనూ వివాదాలు సాధారణంగా మారాయి. అయితే.. చైనా కు సమీపంలో ఉన్న జపాన్ ఇప్పుడు చైనా తీరుతో అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. చైనా నుంచి ముప్పు పెరుగుతుందని భావించిన జపాన్‌ ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున క్రూజ్‌ క్షిపణులను మోహరించాలని నిర్ణయించింది.

చైనా తీర ప్రాంతాలను తాకేలా క్షిపణుల సామర్థ్యాన్ని పెంచేందుకు జపాన్‌ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిట్టు జపాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచుకోవాలని కూడా జపాన్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఉపరితలంపై నుంచి.... నౌకలపైకి ప్రయోగించే క్షిపణుల రేంజి 100 కిలోమీటర్ల వరకూ ఉంది. దాన్ని 1,000 కిలోమీటర్లకు పెంచాలని జపాన్ ఆలోచిస్తోంది. ఈ మార్పు చేస్తే..  చైనా, ఉత్తరకొరియా తీర ప్రాంతాలను కూడా జపాన్ క్షిపణులు కవర్ చేస్తాయి.

దీంతో పాటు జపాన్‌.. తన నౌకలు, విమానాల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కూడా దృష్టి పెట్టింది. జపాన్ తన క్షిపణులను తైవాన్ సమీపంలోని తన చిన్న చిన్న ద్వీపాలపై మోహరించే అవకాశం ఉంది. క్షిపణి సామర్థ్యంలో చైనా, ఉత్తర కొరియా జపాన్ కంటే ముందుంటున్నాయి. అందుకే వాటి స్థాయి అందుకోవాలని జపాన్ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తన సైన్యాన్ని చాలా తగ్గించుకుంది. ఈ అంశంపై ఇప్పుడు జపాన్ పునరాలోచనలో పడంది. సైన్యాన్ని బలోపేతం చేసుకునే ఆలోచన చేస్తోంది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలు మారిపోతున్నాయి. భౌగోళిక, రాజకీయ వివాదాలు పెరుగుతున్నాయి. రష్యా అండతో చైనా కూడా తైవాన్‌ పై దాడికి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో జపాన్‌ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అందుకు సిద్ధంగా ఉంటే మంచిదన్న ఆలోచన చేస్తోంది. జీడీపీలో రక్షణ విభాగానికి నిధులు పెంచి.. ఆయుధ సామాగ్రిని పెంచుకునే ఆలోచన చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: