పోలవరం.. బాబు ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?

పోలవరం నిర్మాణం రోజురోజుకు ఆలస్యం అవుతోంది. అయితే.. ఇందుకు మీరంటే మీరు కారణం అని తెలుగు దేశం, వైసీపీ ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. మాజీ సీఎం చంద్రబాబుకు మూడు ప్రశ్నల సవాల్ సంధించారు. పోలవరం ప్రాజెక్ట్‌ గురించి తాను చాలా సందర్భాల్లో చెప్పానని... మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీని పదేపదే అడుగుతుంటే.. వారు పారిపోతున్నారని  మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

14ఏళ్ల ముఖ్యమంత్రి జీవితం, 44రాజకీయ జీవితం అని చంద్రబాబు చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని.. మరి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయి.. పిరికిపంద చంద్రబాబు నాయుడు అని పేరు తెచ్చుకుంటున్నారని  మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.  ఆ మూడు ప్రశ్నలు ఏంటంటే..
వాటిలో ఒకటి.. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అయితే చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు.. అలా చేయడం తప్పా,  రైటా? చెప్పాలి.. రెండో ప్రశ్న.. కేంద్రం నిర్మిస్తే ఆలస్యం అవుతుందని చంద్రబాబు వంక చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తే త్వరగా అవుతుందని చెప్పారు. కానీ 2018కి పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తవుతుందని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పితీరాలి.

ఇక మూడో ప్రశ్న.. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రం వాల్‌ కట్టినటువంటి ప్రబుద్ధుడు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే.. ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రం వాల్‌ వేయాల్సి వస్తే.. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రం వాల్‌ చేపడతారని... కాని దురదృష్టవశాత్తు ఎందుకు కట్టారో చెప్పలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని  మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని.. వీటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతూ... తప్పిదాలను తమమీద రుద్దాలనే తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారని  మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: