మోదీ సాబ్‌: ఏపీపై ప్రేమ.. తెలంగాణపై పగ?

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. డిస్కమ్‌లు లెక్కకు మించి బకాయిలు ఉన్నాయని.. అవి తీర్చే వరకూ విద్యుత్ కొనుగోలుకు అనుమతించబోమని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. అంతే కాదు.. ఎక్సేంజ్‌ నుంచి ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనకుండా నిషేధం విధించింది. అలా నిషేధం విధించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు కరెంట్ ఇబ్బందులు తప్పవని అంతా అంచనా వేశారు.

అయితే.. విచిత్రంగా కేంద్రం రెండో రోజే తన ప్రకటనను సవరించుకుంది. తెలంగాణ డిస్కంలు రూ. 1,360 కోట్లు బకాయి పడినట్టు తొలుత పేర్కొన్న కేంద్రం.. శుక్రవారానికి సవరణ ఇచ్చింది. లెక్కలు సరిచూడకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ మొత్తం చెల్లిస్తేనే కరెంటు కొనుగోలుకు అనుమతిస్తామని కేంద్రం వెల్లడించింది. అయితే అంత బకాయి కూడా లేదని తెలంగాణ డిస్కంలు
అంటున్నాయి. విచిత్రం ఏంటంటే.. ఏపీ సహా ఆరు రాష్ట్రాలు సమర్పించిన లెక్కలు సరిచూశాక వాటిపై నిషేధాన్ని కేంద్రం తొలగించింది. తెలంగాణ మాత్రం ఇంకా బకాయి ఉందంటూ నిషేధాన్ని కేంద్రం కొనసాగిస్తోంది.

విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిల విషయంలో కేంద్రం లెక్కల్లో తప్పులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఒక్కరోజులోనే కేంద్రం లెక్కల్లో తేడాలు చూపిండంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేల కోట్ల రూపాయల లెక్కల్లో అంత నిర్లక్ష్యం ఎలా ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 52 కోట్లు బకాయి ఉన్నందుకు ఓ రాష్ట్రాన్ని విద్యుత్‌ కొనుగోలు చేయకుండా నిషేధిస్తారా అంటూ టీఆర్ఎస్‌ నేతలు కేంద్రంపై మండిపడుతున్నారు.

ఇదే సమయంలో ఏపీ కేంద్రానికి బకాయి లేదంటూ నిన్ననే విద్యుత్ కొనుగోలుకు కేంద్రం అనుమతించింది. దీంతో ఏపీ పై అంత ప్రేమ ఏంటి.. తెలంగాణ పై ఇంత పగ ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కేంద్రం ఇలాంటి సీరియస్‌ అంశాల్లోనూ తప్పుల తడకగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: