వాళ్ల కోసం 3 ఏళ్లలో 53 వేల కోట్లు ఖర్చు చేసిన జగన్‌?

ఏపీలో విద్యారంగంలో ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. పెద్ద చదువులు ప్రోత్సహిస్తూ పూర్తిగా వంద శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. ఆ డబ్బును నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి.. ఆ మూడు నెలలు అయిన వెంటనే డబ్బును విద్యార్థుల అమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. తాజాగా 2022 ఏప్రిల్, మే, జూన్‌ మూడు నెలల కాలానికి సంబంధించి 11.02 లక్షల మంది పిల్లల కోసం వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బు రూ.694 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

జగన్ సర్కారు మూడు సంవత్సరాల కాలంలోనే కేవలం ఒక్క విద్యారంగం మీదే కేవలం 3  పథకాల మీదనే ఏకంగా 53 వేల కోట్లు ఖర్చు చేసింది. ఒక్క జగనన్న అమ్మఒడి పథకానికే రూ.19,618 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకానికి రూ.11,711 కోట్లు  ఖాతాల్లో జమ చేశారు. జగనన్న గోరుముద్ద పథకానికి  రూ.3117 కోట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఇక జగనన్న విద్యా కానుకకు రూ.2324 కోట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు రూ.4895 కోట్లు ఖర్చు చేసింది.  మన బడి, నాడు –నేడు కింద ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు ఏకంగా రూ.11,669 కోట్లకు చేరింది. అంటే మొత్తం కలుపుకుంటే రూ.53,338 కోట్లు విద్యారంగానికి జగన్ ప్రభుత్వం  ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకే ఈ మూడేళ్లలో రూ.11,715 కోట్లు చెల్లించారు.

వసతి దీవెన కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి రెండు దఫాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఏకంగా రూ.20 వేలు ఖాతాల్లో వేస్తున్నారు. పాలిటెక్నిక్‌ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు ఖాతాల్లో వేస్తున్నారు.  ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు ఇస్తున్నారు. దీనికి తోడు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకొని 1.60 లక్షల మందికి ట్రైనింగ్‌లు, సర్టిఫికెట్లు ఇప్పించారు. కాలేజీలు అయిపోయిన వెంటనే ఉద్యోగాలు సులభంగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: