చైనా ఫోన్‌ కంపెనీలకు ఇండియా బిగ్ షాక్‌?

స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇండియాలో ఇప్పుడు అందరూ చూసేది చైనా కంపెనీల వైపే.. ఎందుకంటే.. కాస్త తక్కువ ధరలో అన్నిరకాల ఫీచర్లు అందించే సంస్థలు చైనా సంస్థలే. చైనా సంస్థలు కూడా ఇండియాలోనే అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు చేసుకుని లక్షల సంఖ్యలో ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. చైనా ఫోన్ల కంపెనీలకు ఇండియా మార్కెట్ అతి పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు. కానీ.. అలాంటి చైనా ఫోన్ల సంస్థలకు భారత ప్రభుత్వం త్వరలోనే బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే రూ.12,000 లోపు సెల్‌ఫోన్లను అడ్డుకునేందుకు ఇండియా గట్టి చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. షియామీ, వివో, ఓపో, రియల్‌మీ వంటి చైనా మొబైల్ సంస్థల ధాటికి భారత దేశీయ సంస్థలు లావా, మైక్రోమ్యాక్స్‌ వంటివి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. భారీ ప్లాంట్లు కలిగిన చైనా సంస్థలకు ఈ దేశీయ కంపెనీలు పోటీ ఇవ్వలేక పోతున్నాయి. అందుకే అనేక దేశీయ సంస్థలు తమ కార్యకలాపాలు నిలిపేస్తున్నాయి కూడా.

ఈ నేపథ్యంలో దేశీయ తయారీదార్లను కాపాడుకునేందుకు రూ.12,000లోపు విభాగంలో చైనా సంస్థల ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా ఆంక్షలు విధించబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే అది చైనా కంపెనీలకు శరాఘాతమే అనుకోవాలి. ఎందుకంటే.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ విపణి అయిన మన దేశంలో ఈ ఛాన్స్ కోల్పోవడం చాలా నష్టదాయకం.

ఇప్పుడు ఇండియాలో అమ్ముడయ్యే రూ. 12 వేల లోపు ఫోన్లలో 80 శాతం చైనా కంపెనీలవే కావడం విశేషం. దీనికి తోడు చైనా సంస్థలు లక్షల కోట్లు సంపాదిస్తున్నా సరిగ్గా పన్నులు కూడా కట్టకుండా ఎగనామం పెడుతున్నాయి. అందుకే ఈ చైనా సంస్థలకు ముకుతాడు వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విధానం తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఒకవేళ కేంద్రం రూ.12,000 లోపు ఫోన్లు ఇండియాలో విక్రయించవద్దని చైనా సంస్థలను కట్టడి చేస్తే..  షియామీ స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు 14 శాతం వరకూ తగ్గే అవకాశం ఉంది. షియామీ తయారు చేస్తున్న స్మార్ట్‌ఫోన్లలో 70 శాతం వరకు రూ. 12 వేల ధరలోపు ఉన్నవే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: