గోరంట్ల మాధవ్‌ది లేట్ అయితే.. బాబు సంగతేంటి?

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదం ఇంకా ఓ కొలిక్కి చేరలేదు. ఆ మార్ఫింగ్‌ కాకపోతే చర్య తప్పదని ఇప్పటికే వైసీపీ తేల్చి చెప్పింది. గోరంట్ల మాధవ్ కూడా ఈ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ వీడియోను ఫోరెన్సిక్‌ నిపుణుల వద్దకు పంపారు. అయితే.. ఆ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. అయితే.. ఓ వీడియో నిగ్గు తేల్చడానికి ఇంత సమయం ఎందుకని టీడీపీ నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఇలా టీడీపీ నేతలు విమర్శలు చేయడం వైసీపీ నేతలకు మంట పుట్టిస్తోంది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారానికి సంబంధించి, గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నామంటున్న వైసీపీ..  ఆ వీడియో వాస్తవమని తేలితే తప్పనిసరిగా చర్య తీసుకుంటామంటోంది. అయితే.. టీడీపీ నాయకులు విమర్శిస్తున్నట్టు ఆ వీడియో వాస్తవమా? కాదా? అన్నది తేల్చడం అంత సులభమేమీ కాదని..  ఇన్ని రోజులు అవసరం లేదనడం సరికాదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

వీడియో నిగ్గు తేల్చేందుకు అరగంట చాలని అనడం అవివేకమంటున్న సజ్జల... ఈ సమయంలో మరో కీలక ప్రశ్న లేవనెత్తారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ద్వారా ఏకంగా రూ.50 లక్షలు ఇచ్చి పంపాడని.. ఆ తర్వాత ఆయనే స్వయంగా మాట్లాడాడని... అయినా ఇప్పటి వరకు, ఓటుకు కోట్లు కేసులో ఆ గొంతు చంద్రబాబుది అని తేల్చలేదని గుర్తు చేశారు. ఇంత వరకూ అది తన గొంతు కాదని చంద్రబాబు చెప్పనే లేదన్నారు.

వైసీపీ ఎంపీకి సంబంధించి మాట్లాడిన వీడియోకాల్, వేరే ఫోన్‌లో రికార్డు చేశారని..  అందులో ఎవరున్నారో తెలియదని..  ఎవరు రికార్డు చేశారో తెలియదని.. అయినా ఏదేదో జరిగిపోయినట్లు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. ఈ వీడియోతో మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే భంగం కలిగినట్లు తెలుగుదేశం నాయకులు మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న సజ్జల... ఆ వీడియో మార్ఫింగ్‌ కాదని తేలితే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఆ రిపోర్టు రావడానికి మరి కొంత సమయం పడుతుందన్న సజ్జల.. రిపోర్టును బట్టే చర్యలు ఉంటాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: