మోదీతో చంద్రబాబు: చెప్పాల్సింది చాలా ఉందా?

ఇటీవల చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. మోదీతో సమావేశం అంటే.. అదేదో అపాయింట్ మెంట్ తీసుకుని గంటా రెండు గంటలు సమావేశం కావడం కాదు లెండి.. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాల నిర్వహణ అంశంపై ఓ కమిటీ సమావేశానికి చంద్రబాబు కూడా వెళ్లారు. అక్కడ చంద్రబాబుతో మోదీ ఓ నిమిషమో.. రెండు నిమిషాలో మాట్లాడారట. ఇక అంతే.. ఆయన అనుకూల మీడియాకు అదో బ్యానర్ అయిటమ్ అయిపోయింది.

చంద్రబాబుతో మోడీ మాట్లాడారని అనుకూల మీడియా ఘనంగా చెప్పుకుంటోంది. అంతే కాదు.. ఏంటి చంద్రబాబు గారూ.. మీరు ఢిల్లీ అసలు రావడం లేదేంటి అంటూ చంద్రబాబుపై మోడీ జాలి పడ్డారట. ఇక చంద్రబాబేమో.. మీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉందని ప్రధానితో అన్నారట. మోదీ కూడా మీతో చాలా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయన్నారట. మరి ఇంకేం.. త్వరలోనే చంద్రబాబుతో నరేంద్ర మోదీ సుదీర్ఘమైన సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట.

అయితే.. అలా మాట్లాడే ముందు.. 2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై చంద్రబాబు చేసిన ఘాటైన విమర్శల గురించి కూడా మాట్లాడుకుంటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌ అన్నమాట. వీరిద్దరూ ఎలాంటి విషయాలు చర్చిస్తారో అన్నది చర్చనీయాంశంగా మారింది.  ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ నివాసంలో ఒంటరి జీవితం గడుపుతున్నారు. అక్కడి నుంచే ఏపీ రాజకీయాలు సాగిస్తున్నారు. అంటే సొంత రాష్ట్రంలో కూడా ఆయన నివాసం ఉండటం లేదు.

మరి అలాంటి చంద్రబాబుపై ప్రధాని మోదీజీ జాలిపడాల్సిందే అంటున్నాయి వైసీపీ శ్రేణులు. చంద్రబాబు తొందర్లోనే ప్రధానితో భేటీకి అపాంట్‌మెంట్‌ తెచ్చుకుని జాతిహితం కోసం ఎలాంటి సలహాలు ఇస్తారో అంటూ వైసీపీ వర్గాలు వెటకారం ఆడుతున్నాయి. బిల్‌ క్లింటన్, బిల్‌ గేట్స్‌ పేర్లు చెప్పుకుని పదేళ్లు గడిపిన బాబుకు ఇప్పుడు దేశ ప్రధాని అవసరం, భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే  అవసరం ఇన్నాళ్లకు కనిపిస్తున్నాయా అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ వీధులను మర్చిపోకుండా ఉండాలంటే ఇలా రెండేళ్లకు ఒకసారైనా చంద్రబాబు గారికి వచ్చే అవకాశం ఉంటే మంచిదేమో అంటూ వ్యంగ్యోక్తులు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: