ఆ విషయంలో రికార్డు సృష్టించిన ఏపీ రైతులు?

ఏపీలో ఒక్కో రైతు కుటుంబంపై ఎంత అప్పుందో తెలుసా.. సగటున 2 లక్షల45 వేల 554 రూపాయల రుణ భారం ఉందట. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఒక్కో కుటుంబంపై సగటున 74 వేల121 రూపాయల రుణ భారం ఉంది. అంటే దేశ సగటుతో పోల్చితే ఏపీ రాష్ట్ర రైతులపై 221 శాతం వరకు రుణ భారం ఉందన్నమాట. దేశవ్యాప్తంగా 9 కోట్ల 30లక్షల 93 వేల500 రైతు కుటుంబాలు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో 31 లక్షల58 వేల 700 రైతు కుటుంబాలు ఉన్నాయి.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. కేంద్ర మంత్రి అందించిన సమాచారం ప్రకారం ఇంతగా భారీస్థాయిలో తలసరి అప్పు మరే రాష్ట్ర రైతు కుటుంబాలపైనా లేదన్నమాట. అదే తెలంగాణలోని 26 లక్షల55 వేల700 రైతు కుటుంబాలు ఉంటే.. తలసరి సగటున లక్షా 52 వేల113 రూపాయల మేర భారం ఉంది.  అంటే తెలంగాణతో పోల్చితే.. ఏపీ రైతులపై అప్పుల భారం 61.42 శాతం భారం అధికంగా ఉందన్నమాట.

ఏపీ తర్వాత అప్పుల భారం ఎక్కువగా ఉన్న రైతులు కేరళ రైతులే. వీళ్ల అప్పులు సగటున 2లక్షల42 వేల 482 రూపాయలుగా ఉన్నాయట. ఆ తర్వాత పంజాబ్ రైతులు.. వీరి అప్పు 2 లక్షల3 వేల 249 రూపాయలు అయితే.. హర్యానా రైతు అప్పులు లక్షా 82 వేల 922 రూపాయలుగా ఉన్నట్టు కేంద్రం తన నివేదికలో తెలిపింది. అదే తెలంగాణ రైతు విషయానికి వస్తే.. ఈ రైతులు లక్షా 52 వేల 113 రూపాయలు అప్పుల భారం మోస్తున్నారు.

దేశంలోని మిగిలిన రైతుల విషయానికి వస్తే.. కర్ణాటక రైతు అప్పులు 1,26, 240 రూపాయలుకాగా..  తమిళనాడు రైతుల అప్పుల భారం 1,06,553 రూపాయలుగా ఉంది. ఎక్కువగా రుణ భారం ఉన్న రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్‌ను మినహాయిస్తే మిగిలినవన్నీ దక్షిణాది రాష్ట్రాలే కావడం విశేషం. ఇక దేశంలోనే తక్కువ అప్పులు నాగాలాండ్ రైతు కుటుంబాలపై ఉన్నాయి. ఇక్కడ రైతు అప్పు సగటున కేవలం  1,750 రూపాయలే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: