మూసీతో హైదరాబాద్‌ వాసులకు ఇంత ముప్పా?

మూసీ నీళ్లు త్రాగడంతో పశువులిచ్చే పాలల్లో కూడా విషతుల్యాలు ఉంటున్నాయి. కూరగాయలు పండ్లు కూడా విషమయం అవుతున్నాయి. అంతే కాదు.. ఈ నీళ్లు తాగితే మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయి. ఈ ప్రాంతంలో పుట్టే పిల్లలు శారీరక, మానసిక వైకల్యంతో పుడుతున్నారు. మూసీ నదికి రెండు వైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం కనిపిస్తోంది. మూసీ నదికి 3 కిలోమీటర్ల పరిధిలో తీవ్రత మరింత అధికంగా ఉంటోంది.

మూసీ నది నీటితో పెరిగిన ఆకుకూరల్లో రసాయన అవశేషాలు ఎక్కువ స్థాయిలో ఉంటున్నాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఓ పరిశోధనలోనూ తేలింది. మూసీ నది నీటితో పండిన పంటలు, పాడి ఉత్పత్తులు తింటున్న భాగ్యనగర ప్రజలకు తీవ్రమైన అనారోగ్య ముప్పు ఉంది. గతంలో వికారాబాద్‌ నుండి వాడపల్లి వరకు 23 కత్వాల ద్వారా మూసీ నది లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది.

కానీ ఇప్పుడు  కత్వాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ కత్వాలను పునరుద్ధరించే దిశగా ఒక్క చర్యా చేపట్టడం లేదు. గతంలో మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ అది అమలు ఒక్క అడుగు కూడా ముందుకు పడనేలేదు. గుజరాత్‌లోని సబర్మతి మాదిరిగా మూసీనదిని  సుందరీకరిస్తామన్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకూ పెద్దగా చర్యలు తీసుకోలేదు. అలాగే మూసీనదిలో పరిశ్రమల వ్యర్థాలను  కలుపుతున్నా చర్యలు తీసుకోవడం లేదు.

ఇప్పటికైనా మూసీతీర ప్రాంత ప్రజలు కష్టాలను అర్థం చేసుకొని, వీరి సమస్యలకు పరిష్కారం దిశగా సానుకూల చర్యలు తీసుకోవాలి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు రూ.4000 కోట్లు కేటాయించాలి. ఈ నిధులు వెంటనే విడుదల చేసి, ఎలాంటి అవినీతికి అస్కారం లేకుండా ఆ నిధులను సక్రమంగా వినియోగించాలి. మూసీ నది కలుషిత జలాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఇక్కడి ప్రజలకు తగిన వైద్య సదుపాయాలు అందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: