మోదీ సాహసం: ప్రైవేటు చేతికి విద్యుత్‌ పంపిణీ?

మోదీ సర్కారు మరో సాహసానికి సిద్ధం అవుతోంది. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణ బిల్లును సిద్ధం చేసింది. విద్యుత్‌ రంగంపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలకు ఈ చట్టంతో కత్తెర పడుతుంది. అంతే కాదు.. పంపిణీ రంగంలో పోటీ వాతావరణం సృష్టించేందుకు కేంద్రం ఈ విద్యుత్‌ చట్టాన్ని సవరిస్తోంది.

ఈ చట్ట సవరణ అమల్లోకి వస్తే ఏమవుతుందో తెలుసా.. ఇక దేశంలో ఎక్కడైనా విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రైవేటు సంస్థలు రావొచ్చు. ఇప్పుడు మొబైల్‌ వినియోగదారులు ఎలాగైతే తమకు ఇష్టం వచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్నారో ఇకపై విద్యుత్‌ కనెక్షన్ల విషయంలోనూ నచ్చిన సంస్థ నుంచి కరెంటు పొందే అవకాశం దక్కుతుంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ చట్ట సవరణను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

ఇప్పటికే విద్యుత్‌ సంరక్షణ బిల్లును కేంద్రం పార్లమెంటులో పెట్టింది. ఇప్పుడు విద్యుత్‌ చట్ట సవరణను కూడా ప్రవేశపెట్టబోతోంది. ఈ రెండు బిల్లులు చట్టాలైతే... ఒకే ప్రాంతంలో పలు కంపెనీలు కరెంటు సరఫరా చేయొచ్చు. వ్యాపారపరంగా పోటీ ఏర్పడి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం లేదా తగ్గించడం వంటి చర్యలకు పాల్పడవు. అయితే.. విద్యుత్‌ ఛార్జీ గరిష్ఠంగా ఎంత ఉండాలి, కనిష్ఠంగా ఎంత ఉండాలనే సీలింగ్‌ నిబంధనలను ఈఆర్సీ రూపొందిస్తుంది. ఒక వినియోగదారు ఒక మెగావాట్‌కన్నా ఎక్కువ కరెంటు వినియోగిస్తుంటే ఆ వ్యక్తి దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ కొనుక్కోవచ్చు.

బహిరంగ మార్కెట్‌లో ఇలా కొనడాన్ని ఓపెన్‌ యాక్సిస్‌ అంటారు. దీన్ని సరఫరా చేయడానికి స్థానిక డిస్కంలు కచ్చితంగా సహకరించాల్సి ఉంటుంది. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ లైసెన్సులిస్తే వాటి కోసం క్రాస్‌ సబ్సిడీ నిధిని రాష్ట్రం ఏర్పాటు చేయాలి.  కొత్త కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ వ్యాపారానికి లైసెన్సులిస్తే పాత డిస్కంకు పీపీఏలో నిర్దేశించిన ఖర్చులను కొత్త కంపెనీలు కూడా పంచుకుంటాయి. ఈ పంపకాలను ఈఆర్‌సీ నిర్ణయిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: