అయ్యో ఏపీ: ఆ హామీ తీరని కలేనా.. ఇక అంతేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో నష్టపోతున్నా ఏపీకి ఊరటగా కేంద్రం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అవి. కానీ.. అవి అమలుకునోచుకోవడం లేదు. సాక్షాత్తూ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇప్పటికీ నీటి మూటగానే ఉండిపోయింది. ఆనాడు ఏపీ విభజనకు గట్టిగా మద్దతు తెలిపిన బీజేపీయే ఇప్పుడు అధికారంలో ఉన్నా.. ఆ మాట అడగొద్దని తేల్చి చెబుతోంది.

ఈ విషయం మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో కేంద్రం  పాత విషయాలే మళ్ళీ చెప్పింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని మరోసారి లోకసభకు కేంద్ర హోం శాఖ తెలిపింది.  టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్... ఈ విషయం మరోసారి కుండబద్దలు కొట్టేశారు. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేకహోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న కేంద్రం హోం శాఖ.. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42శాతానికి ఆర్ధిక సంఘం పెంచిందని గుర్తు చేస్తోంది.

రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను 14వ ఆర్ధిక సంఘం కేటాయించిందని.. దాన్ని 15వ ఆర్ధిక సంఘం కూడా ఈ సిఫారసులను కొనసాగించిందని  కేంద్రం తెలిపింది. విభజన చట్టంలోని హామీలను చాలా వరకూ కేంద్రం నెరవేర్చినట్లు తమ సమాధానంలో తెలిపిన నిత్యానంద రాయ్.. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని... వాటిని 10 ఏళ్ల కాలంలో పరిష్కరించనున్నామని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని  కేంద్రం పార్లమెంటులో వివరించింది. సో.. మరోసారి కేంద్రం ప్రత్యేక హోదా అంశంపై తేల్చి చెప్పేసింది. అంటే ఇక ఏపీ ప్రత్యేక హోదా అంశా‌న్ని పూర్తిగా మర్చిపోవాల్సిందే అన్నమాట. అది తీరని కలే అన్న విషయం మరోసారి రుజువైపోయింది. మరి సాక్షాత్తూ పార్లమెంటులోనే దేశ ప్రధానే ఇచ్చిన హామీకే విలువ లేకపోతే.. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో విరాజిల్లుతున్నట్టు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: