పోలవరం: తెలంగాణ అనవరసరంగా రచ్చ చేస్తోందా?

గోదావరి వరదల వల్ల భద్రాచలం, ముంపు మండలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరదల్లో భద్రాచలం మునిగిపోయే పరిస్థితి రావడంతో ఈ వివాదం తలెత్తింది. దీనిపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. విలీన మండలాలను తెలంగాణకు ఇవ్వాలని మంత్రి పువ్వాడ కోరారు. కనీసం ఐదు గ్రామాలైనా తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. పువ్వాడ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతున్న సమయంలో ఏపీ మంత్రులూ స్పందించారు.

ముంపునకు గురయ్యే  ప్రాంతాలన్నింటినీ సర్వే చేసిన తర్వాతే కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందన్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. ఒకవేళ వివాదాలు ఏమైనా ఉంటే దానికి వేదికలు ఉన్నాయని గుర్తు చేశారు. సీడబ్లూసీ, కేంద్రం, పీపీఏ, జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి, కృష్ణా నదీ బోర్డులు ఉన్నాయని.. అయినా పోలవరం ప్రాజెక్టు లెవల్ 45.72 మీటర్లు అని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఆ లెవల్ పెట్టిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు.  

వాస్తవానికి.. పోలవరం కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం కాదన్న సంగతి తెలిసిందే.  పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఎప్పుడో పర్మిషన్లు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. జరిగిందేదో జరిగిపోయింది. విలీన మండలాలను ఏపీలో కలిపినప్పుడే తెలంగాణ అభ్యంతరం చెప్పడమో.. ఆందోళన చేయడమో చేయాల్సింది. కానీ.. తెలంగాణ వచ్చిన కొత్తలో వివాదం ఎందుకనుకున్నారో ఏమో.. ఆ సమయంలో టీఆర్ఎస్ నామమాత్రపు ఆందోళనతో సరిపెట్టింది.

ఇప్పుడు కొత్తగా ఈ వివాదం తీసుకురావడంలో పెద్దగా ఉపయోగం ఉండదు.. కావాలంటే ఈ విషయాన్ని కేంద్రం వద్ద తేల్చుకోవాలి తప్ప.. ఊరికే మీడియా ముందు మాట్లాడటం వల్ల అనవసర వివాదం తప్ప.. ఎలాంటి ఉపయోగం ఉండదన్న విషయం తెలంగాణ మంత్రి గుర్తించాలి.. రెండు రాష్ట్రాల నేతలు.. ఈ విషయంలో సంయమనంతో మాట్లాడటం అందరికీ మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: