అన్నీ కోల్పోయిన వరద బాధితులు.. ఆదుకోండి?

తెలుగు రాష్ట్రాల్లో వరదలు గోదావరి పరీవాహక ప్రాంతాలను ముంచెత్తాయి. వేల కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయాయి. గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చాయి.. ఈసారి కూడా వచ్చాయి. అయితే.. వరద బాధితుల కథ మాత్రం మారడం లేదు. ఏళ్ల తరబడి వాళ్ల బతుకులు అలాగే సాగుతున్నాయి. వారం రోజులుగా వరద ముంపుతో ప్రజలు అల్లాడుతున్నా.. వారికి అందుతున్నది అరకొర సాయమే.

భారీ వర్షాలకు ఇండ్లు కోల్పోయి పూర్తిగా నిరాశ్రయులైన వేలాది మంది ముంపు బాధితులను ఏ విధంగా ఆదుకుంటారన్న విషయం ఇంకా స్పష్టత లేదు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఆ హామీ ఎంత మేరకు నెరవేరుస్తారో చూడాలి. గతంలోనూ హైదరబాద్‌లో ఇలాంటి హామీలే ఇచ్చి మరిచిపోయిన విషయం ఇంకా ప్రజలకు గుర్తుంది. అంతే కాదు.. ఆ సాయం పై కూడా విమర్శలు వస్తున్నాయి.

సర్వం కోల్పోయిన బాధితులకు ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుందన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి సీఎం పర్యటనలో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం, బాధితుల సంఖ్యపై అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆర్ధిక సాయం ప్రకటించారు. అయితే.. కేవలం మాటలతో సరిపుచ్చకుండా ఆ సాయం అందేలా చూస్తే కొంత వరకూ ఊరట కలిగినట్టే.  

అలాగే 10 వేల ఇండ్లతో కాలనీ నిర్మిస్తానని కేసీఆర్ చెప్పిన మాటలు చెవులకు ఇంపుగానే ఉన్నాయి. అదే సమయంలో కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుని.. ఇవి అమలయ్యేనా అన్న అనుమానం బాధితుల్లో కనిపిస్తోంది. అలాగే వారం రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వందలాది గ్రామాలు మంపుకు గురై వేలాది మంది నిరాశ్రయలవుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని.. చివరకు విపక్షాల విమర్శలతోనే ప్రగతి భవన్ నుంచి కదిలారన్న విమర్శలూ వస్తున్నాయి. ఏదేమైనా రూ. 10 వేలు సాయం చేస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఆ సాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఏపీ సర్కారు రూ. 2000 ఇస్తామని ప్రకటించింది. మాటలన్నీ అమలైతేనే బాధితులకు కాస్త ఊరట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: