జనసేన మరో 20 ఏళ్ల వరకూ అధికారంలోకి రాదా?

జనసేన.. ఏపీలో ఓ పార్టీ.. ఈ పార్టీ స్థాపించి 8 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటి వరకూ ఈ పార్టీ రాజకీయంగా సాధించింది ఏంటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోతగ్గ ప్రగతి కనిపించదు. పవన్ కల్యాణ్ లాంటి మాస్ హీరో పెట్టిన పార్టీ కావడంతో జనంలో బాగానే అంచనాలు ఉన్నాయి. కానీ.. అవేవీ వర్కవుట్ కాలేదు. 2014లోనే పార్టీ పెట్టినా.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది.

ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో టీడీపీతో పొత్తు తెంచుకుని.. ఒంటరిగా బరిలో దిగింది. చివరకు పవన్ కల్యాణ్ కూడా రెండుచోట్లా ఓడిపోవడం ద్వారా తీవ్రంగా భంగపాటు ఎదురైంది. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు సాధించింది. సాధారణంగా ఇలాంటి ఫలితం వస్తే.. ఎవరైనా నిరాశ చెందుతారు..అందులోనూ సినిమా వాళ్లయితే.. ఈ రాజకీయాలకో దండం అనుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తాను అలాంటి వాడిని కాదంటున్నారు. తాను రాబోయే తరాల కోసమే సరికొత్త పార్టీ స్థాపించానని చెబుతున్నారు.

తమ పార్టీ సిద్దాంతాలు పనిచేయవని కొందరంటున్నారన్న పవన్‌.. ఈ స్థాయికి రావడానికి బీజేపీకి 20 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. అవినీతిని వాజ్‌పేయి, అడ్వాణీ పార్లమెంటులో ప్రశ్నించారని గుర్తు చేశారు. పెద్ద భవనానికైనా.. పునాదులే ముఖ్యమని.. నాకు ఆశలు లేవు.. అశయాలు మాత్రమే ఉన్నాయని పవన్‌ కల్యాణ్ చెబుతున్నారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలంటున్న పవన్‌ కల్యాణ్‌... నా రాష్ట్రం, నా ప్రాంతం‌ అంటే జాతీయవాదానికి దూరం అవుతామంటున్నారు.

అవినీతి పెద్ద సమస్య కాదన్నట్లు ప్రజలు చూస్తున్నారంటున్న పవన్‌ కల్యాణ్‌.. దోపిడీ చేసే ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచిస్తున్నారు. మద్యం రద్దు అన్న నాయకులే ఇప్పుడు ఏపీలో మద్యం ఏరులై పారిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రాజకీయ క్రీడలకు రాష్ట్రాన్ని బలి‌ చేయకండని పవన్‌ కల్యాణ్‌ సూచిస్తున్నారు. అంతా బాగానే ఉంది. అంటే మరో 20 ఏళ్ల వరకూ జనసేనకు అధికారం వచ్చే అవకాశం లేదని పవన్ డిసైడ్ అయ్యాడా ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: