ఆంధ్రప్రదేశ్‌ కోరికలు ఇవి.. మోదీ తీరుస్తారా..?

కేంద్రం సహకారం అందిస్తేనే రాష్ట్రాలు కూడా ప్రగతి పథంలో పయనిస్తాయి. అందుకు కేంద్రం తోడ్పాటు తప్పనిసరి. ఏపీ విషయానికి వస్తే.. అనేక విషయాల్లో ఏపీ కేంద్రం సహకారం కోరుతోంది. వాటిలో కొత్త జిల్లాలకు మౌలిక సదుపాయాలు ఒకటి.. ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య 26కు చేరినట్టయింది.. ఏపీ రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో 3 మెడికల్‌ కాలేజీలకు మాత్రమే కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ కొత్త కాలేజీల పనులు చురుగ్గానే సాగుతున్నాయి.

అయితే.. మొత్తంగా 26 జిల్లాలకు కేవలం 14 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్ర ప్రజలు అందరికీ అందుబాటులో ఉండాలంటే.. ఇంకా కొన్ని మెడికల్‌ కాలేజీలు అవసరం. అందుకే మిగిలిన 12కాలేజీలకు కూడా అనుమతులు ఇస్తే.. కనీసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అయినా ఉంటుంది కదా అని ఏపీ ఆలోచిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తులు పంపుతోంది.

అలాగే విశాఖ సమీపంలోని భోగాపురంలో ఎయిర్‌పోర్టును ఏపీ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు గతంలోనే క్లియరెన్స్‌ ఇచ్చినా దాని గడువు ముగిసింది. ఇప్పుడు మళ్లీ క్లియరెన్స్‌ వస్తే కానీ పనులకు ఆటంకం ఉండదు.. ఆ క్లియరెన్స్ కూడా ఇవ్వాలని పౌరవిమానయానశాఖను ఏపీ కోరుతోంది. అలాగే  ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తామని మాట ఇచ్చారు.  కానీ.. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్‌ నడవాలంటే నిరంతరాయంగా ఐరన్‌ ఓర్‌ సరఫరా ఉండాలి. అలా ఉండాలంటే ఏపీఎండీసీకి  ఇనుప గనులను కేంద్రం కేటాయించాలి.

రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఆర్థిక ప్రగతి కోసం ఈ  స్టీల్‌ప్లాంట్‌ కు సొంత ఇనుప గనులు కేటాయించాలని ఏపీ కోరుతోంది. అలాగే ఇంటిగ్రేటెడ్‌ బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ ప్రాజెక్టుకు ఏపీ ప్లాన్‌ చేస్తోంది. రూ.20వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించ వచ్చని ఆలోచిస్తోంది. అయితే.. 16 చోట్ల బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రతిపాదనలను ఏపీ ఇప్పటికే కేంద్రానికి అందించినా ఇంకా పచ్చజెండా ఊపలేదు. మరి ఇన్ని అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరి కేంద్రం ఎప్పుడు కరుణిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: