కరోనా గుప్పిట్లో చైనా.. ఇండియాకు లక్కీ ఛాన్స్?

కరోనా మహమ్మారి చైనాను వదలట్లేదు.. జీరో కరోనా కేసుల లక్ష్యంగా చైనా ముందుకు సాగుతోంది. అనేక నగరాల్లో లాక్‌డౌన్లు విధిస్తోంది. కేసుల కట్టడి కోసం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం ఎంతటి కష్ట, నష్టాలకైనా వెనుదీయడం లేదు. అయితే ఇదే పరిస్థితి ఆ దేశ పారిశ్రామిక రంగంపై పెను ప్రభావం చూపుతోంది. చైనా ఇప్పుడు ప్రపంచ తయారీ సంస్థలకు కేంద్రంగా ఉంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే వెసులు బాటు ఉండటంతో అనేక ప్రపంచ స్థాయి సంస్థలు చైనాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నాయి.

కానీ వరుస లాక్‌ డౌన్లు ఆ సంస్థలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. అందులోనూ.. కరోనా మహమ్మారి వ్యవహారం ఇప్పట్లో చైనాలో తగ్గేలా కనిపించడం లేదు. అందుకే చైనా నుంచి బయటకు వెళ్లిపోవాలని అనేక కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో వారికి ఇండియా మంచి అవకాశంగా కనిపిస్తోంది. చైనా నుంచి కంపెనీలు బయటకు వెళ్లిపోవాలని భావించడానికి కరోనాతో పాటు మరో కారణం కూడా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి చైనా పరోక్షంగా మద్దతు పలుకుతోంది.

ఇది అనేక కంపెనీలకు నచ్చడం లేదు. ఈ కారణాలతో అవి చైనాను వీడేందుకు ఆలోచిస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో యాపిల్‌ మొదటి స్థానంలో ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్‌ ఓ కథనం రాసింది.  యాపిల్‌ ఉత్పత్తులు ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ల తయారీ నూటికి 90 శాతం చైనాలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో చైనా విధించిన కఠిన లాక్‌డౌన్‌లతో బిలియన్‌ డాలర్లు విలువ చేసే విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉందని అనేక కంపెనీలు భావిస్తున్నాయి.

చైనాలో కరోనా వ్యాప్తి కారణంగా.. చైనా ఆంక్షల కారణంగా అనేక కంపెనీల ఉద్యోగులకు చైనాలో పని లేకుండా పోయింది. దీనికి తోడు గత ఏడాది చైనాలో తలెత్తిన విద్యుత్తు కోతలు కూడా ఆయా సంస్థల తయారీపై తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ కారణాలతో చైనాను వీడాలనుకునే కంపెనీలకు ఇప్పుడు భారత్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. అందుకే ఆయా సంస్థలను ఆకర్షించే పనిలో ఇండియా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: