చిన జీయర్‌ను వాడేసుకుంటున్న నారా లోకేశ్‌?

రాజకీయాల్లో ఎదుటి పార్టీని విమర్శించడం ప్రధానం. అందుకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా ఆ కామెంట్లను మనం వాడేసుకోవచ్చు. అందులోనూ తటస్థులు, మేథావుల వ్యాఖ్యలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు నారా లోకేశ్ అదే చేస్తున్నారు. ఏపీ రోడ్ల గురించి చినజీయర్ స్వామి ఓ ప్రసంగంలో యథాలాపంగా అన్న మాటల వీడియోను పోస్టు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఏపీ సర్కారు తీరును విమర్శిస్తున్నారు.

రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి ద‌గ్గర‌గా, హిందూ ధ‌ర్మ ప్రచార‌మే జీవిత‌ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఆంధ్రప్రదేశ్‌లో ర‌హ‌దారుల దుస్థితిపై  ఆవేద‌న‌తో స్పందించారని నారా లోకేశ్ అంటున్నారు. గ‌తుకులు-గుంత‌లు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే.. జంగారెడ్డిగూడెం నుంచి రాజ‌మ‌హేంద్రవ‌రం వ‌ర‌కూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోనుంద‌ని చినజీయర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రోడ్ల దుస్థితిని చినజీయర్ చెప్పకనే చెప్పారని నారా లోకేశ్ అంటున్నారు.

ప్రవ‌చ‌నంలో భాగంగానే జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు.. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ర‌హ‌దారులు ఎంత దారుణంగా వున్నాయో స్పష్టం చేస్తున్నాయని నారా లోకేశ్ అంటున్నారు. రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేవ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారని.. ప‌క్కరాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న ఏపీని చూపిస్తున్నారని నారా లోకేశ్ విమర్శిస్తున్నారు. అయినా సరే అయినా ప్రభుత్వం నుంచి స్పంద‌న శూన్యంగా ఉందని నారా లోకేశ్ మండిపడుతున్నారు.

ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఏపీ రోడ్ల గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీలోని మిత్రులు తనకు చెప్పారంటూ.. కేటీఆర్ కొన్ని కామెంట్లు చేశారు. సంక్రాంతికి వెళ్లి అసలు ఏపీలో ఉండలేకపోయామని.. అక్కడ రోడ్లు లేవు, కరంట్ లేదు.. నీళ్లు లేవు.. హైదరాబాద్ వచ్చే వరకూ ప్రాణం ఉగ్గపట్టుకున్నామని ఆయన చెప్పారని కేటీఆర్‌ ఓ రియల్ ఎస్టేట్‌ సమావేశంలో అన్నారు. ఇప్పుడు నారా లోకేశ్ దాన్ని పరోక్షంగా ప్రస్తావించారన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: