పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్‌కు అన్యాయం.. వైఎస్‌కు న్యాయమా?

ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరును స్వల్పంగా మార్పు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. కోనసీమ జిల్లాకు ముందు బీఆర్ అంబేద్కర్ పేరును చేరుస్తూ మార్పు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరించాల్సిందిగా సూచించింది. పేరు మార్పునకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆరంభం నుంచే జిల్లాలో ఆందోళనలు జరుగుతున్నాయి.

కోనసీమ జిల్లాలో దళితుల జనాభా ఎక్కువ. అందుకే ఈ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న ఆందోళనలు బాగా జరిగాయి. ఈ విషయంపై ఆలోచించిన ప్రభుత్వం ఎట్టకేలకు కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయించింది. ఇక ఒకసారి నిర్ణయం తీసుకుంటే అమలైపోతుంది. అందులో పెద్దగా అనుమానం అక్కర్లేదు. అయితే.. ఇలాంటి పేర్లు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేశం కోసం సేవ చేసిన వారిని స్మరించుకునేందుకు జిల్లాలకు వారి పేర్లు పెట్టుకుంటున్నాం. అలాంటప్పడు వారి పేరు ఒక్కటే ఉంటే  సరిపోతుంది.

ఇప్పుడు కోనసీమ జిల్లాకు కోనసీమ పేరు ప్రాంతంలో అంబేడ్కర్ జిల్లా అంటే సరిపోతుంది. అలా కాకుండా అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంటే.. మళ్లీ అంతా కోనసీమ జిల్లా పేరు వాడుతుంటారు. అలా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. ఈ విషయంలో గతంలో వైఎస్సార్ పేరు విషయంలో రుజువైంది. గతంలో కడప జిల్లాకు వైఎస్సార్‌ కడప జిల్లా అని పేరు మార్చారు. కానీ.. వాడుకలో కడప జిల్లా పేరే ప్రాచుర్యంలో ఉంది. వైఎస్సార్ జిల్లా అని ఎవరూ అనేవారు కాదు.

దీంతో ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక.. ఇటీవలే వైఎస్సార్ కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చారు. ఇక ఇప్పుడు కడప జిల్లా పేరు లేదు కాబట్టి తప్పనిసరిగా వైఎస్సార్ జిల్లా అనే రాయాల్సి ఉంటుంది. ఇదే అనుభవం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విషయంలోనూ ఉంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా అంటారు తప్పితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని ఎవరూ వాడరు. అందుకే అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు పేర్లకు న్యాయం చేయాలనుకుంటే.. నేరుగా వారి పేర్లు మాత్రమే జిల్లా పేరుగా ఉండేలా చర్యలు తీసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: