మళ్లీ తెరపైకి మంద కృష్ణ.. తెచ్చింది బాబేనా?

మంద కృష్ణ మాదిగ.. మాదిగ వర్గ నేత.. గతంలో ఓ వెలుగు వెలిగిన వాడు. ఎస్సీల్లో వర్గీకరణ కోసం పోరాడి సాధించిన వాడు. అప్పట్లో తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేసింది. అయితే దాన్ని కోర్టులు కొట్టేశాయి. దీనిపై పార్లమెంటు చట్టం చేస్తే తప్ప ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తేలిపోయింది. మరి పార్లమెంట్‌లో చట్టం అంటే మామూలు విషయం కాదు కదా.. దేశంలో మెజారిటీ పార్టీలను ఒప్పించాలి.

అందుకే ఎస్సీ వర్గీకరణ అనే అంశం అమలుకు నోచు కోలేదు. ఈ విషయంలో రాజకీయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరోసారి మంద కృష్ణ మాదిగ పేరు మళ్లీ తెర పైకి వచ్చింది. ఇటీవల ఏపీ రాజకీయాల్లో మంద కృష్ణ మాదిగ ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా మాదిగలపై మంద కృష్ణ పట్టు కోల్పోయారన్న టాక్ కూడా వచ్చింది. మంద కృష్ణను తెలంగాణకే పరిమితం చేసేందుకు ఆ సామాజిక వర్గం వారే ప్రయత్నాలు చేశారన్న వాదనలు ఉన్నాయి.

మళ్లీ ఇన్నాళ్లకు మళ్లీ మంద కృష్ణ పేరు ఏపీ వార్తల్లో కనిపిస్తోంది. తాజాగా మంద కృష్ణ.. విజయవాడలో టీడీపీ నేత వర్ల రామయ్యను ఆయన నివాసంలో కలిశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఉందంటున్న మంద కృష్ణ మాదిగ.. మాదిగలకు అన్యాయం జరిగిందని తొలుత ఎన్టీఆర్ గుర్తిస్తే, అందుకు కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారంటూ చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు వల్లే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కాయని మంద కృష్ణ మాదిగ గుర్తు చేసుకున్నారు.

కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా పెండింగ్ లోనే ఉందని.. చంద్రబాబు దీనిపై చొరవ తీసుకోవాలని కోరుతున్నానన్నారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని వర్లను కోరానన్న మంద కృష్ణ మాదిగ.. ఎన్నికల్లో సీట్లకు సంబంధించి మాల-మాదిగ, రెళ్లి ప్రజలకు 50-50 నిష్పత్తిలో సీట్లు కేటాయించేలా చొరవ చూపాలని కోరుతున్నాన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: