కేసీఆర్‌ మరీ ఇంత అసమర్థతా.. రేవంత్‌ ఫైర్‌?

తెలంగాణలో గ్రూప్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నాయి. మొత్తం 80 వేల ఉద్యోగాలు ఇస్తామని కొన్నినెలల క్రితం కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ నోటిఫికేషన్లు వస్తున్నాయి. అయితే.. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలంటే.. సరైన మెటీరియల్ కావాలి.. ఆ మెటీరియల్‌ను ఎక్కువగా తెలుగు అకాడమీ ముద్రిస్తుంటుంది. తెలుగు అకాడమీ పుస్తకాలను అభ్యర్థులు ప్రామాణికంగా భావిస్తారు.

ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రామాణిక పుస్తకాలను బేస్ చేసుకునే ప్రశ్నాపత్రాలు రూపొందిస్తుంటుంది. అయితే.. ఇప్పుడు అలాంటి తెలుగు అకాడమీలో పుస్తకాలు లేవు.. ఉన్న పుస్తకాలున్నీ అమ్ముడైపోయాయి. కొత్త పుస్తకాల ముద్రణకు పేపర్ లేదని తెలుగు అకాడమీ చెబుతోంది. మరి ముందే నోటిఫికేషన్లు వస్తాయని తెలుసు.. ఈ పుస్తకాలకు డిమాండ్ ఉంటుందని తెలుసు కానీ.. అందుకు తగ్గట్టుగా తెలుగు అకాడమీని ప్రిపేర్ చేయలేదు.

దీంతో ఇప్పుడు రోజూ ఉద్యోగార్థులు తెలుగు అకాడమీ ముందు బారులు కడుతున్నారు. అసలు పుస్తకాలు లేకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై వివిధ మీడియాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ అంశంపై విపక్ష నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రతి రోజు తెలుగు అకాడమీ వెలుపల క్యూలో నిల్చునే ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పుస్తకాలను అందించడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ కొరత ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోందన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదని.. వారిని సిద్ధం చేయడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వెంటనే సంక్షోభాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిజమే మరి.. అయితే తెలుగు అకాడమీ విభజన సమస్యలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఉమ్మడి ఏపీలో ఏర్పడిన తెలుగు అకాడమీ విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంది. పంపకాల్లో కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ గొడవలో పడి పుస్తకాల ముద్రణపై పెద్దగా దృష్టి పెట్టలేదేమో.. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. మరి ఇకనైనా మేలుకొంటారా సార్లూ..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: