జగనన్నా.. నీ పాలనలో ఈ అరాచకం ఏంటన్నా..?

ఏపీ సీఎం జగన్ పాలనలో రోడ్లు బాగా లేవన్న టాక్ మొదటి నుంచి బాగా వినిపిస్తోంది. విపక్షాలు కూడా ఈ అంశాన్ని బాగా ప్రచారం చేశాయి. అయితే ఇటీవల జగన్ సర్కారు రోడ్ల పనులు మొదలు పెట్టిందని వార్తలు వచ్చాయి. ఆ సంగతి ఏమో కానీ.. చివరకు రోడ్డుపై గుంత కారణంగా వైసీపీ నాయకురాలే ప్రాణాలు కోల్పోయిన ఘటన చూస్తే.. అయ్యో.. జగనన్నా.. నీ పాలనలో ఈ అరాచకం ఏంటన్నా అని బాధపడక మానరు.

ఈ దారుణ ఘటనలో కృష్ణా జిల్లాలో జరిగింది. ఉంగుటూరు ఎంపీపీ అధ్యక్షురాలు పులపాక ప్రసన్నలక్ష్మి వైసీపీ కి చెందిన వారే. ఆమెకు  తేలప్రోలుకు చెందిన ఆమెకు రత్నబాబుతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఆమె ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. గతేడాది ఆమె వైసీపీ నుంచి ఎంపీటీసీగా గెలిచారు. ఆమె మంగళవారం సాయంత్రం ముక్కపాడుకు భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

తేలప్రోలు-ఉయ్యూరు మధ్య ఆనందపురం ఆడ్డరోడ్డు దగ్గర రహదారిపై ఉన్న గుంతలో వారి బైక్‌ పడింది. బైక్  అదుపు తప్పి ప్రసన్నలక్ష్మి కిందపడ్డారు. బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో వెనుకకూర్చొన్న ప్రసన్నలక్ష్మి పది మీటర్ల దూరం ఎగిరి పడ్డారట. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే చిన్నఅవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

కిందపడినప్పుడు తల రోడ్డుకు బలంగా తాకడంతో ఆమె పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు చెప్పారట. ఘటన రాత్రి సమయంలో జరగడంతో అంబులెన్సు వచ్చేందుకు కూడా సమయం పట్టింది. అటుగా వస్తున్న ఫాదర్‌ విజయరాజు ఆమెను తన కారులో పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా ఆమె ప్రాణం మాత్రం కాపాడుకోలేకపోయారు. రహదారుల దుస్థితికి ఈ ప్రమాదం అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని విపక్షాలు తమ ప్రచారం కోసం వాడుకుంటున్నాయి. ఏపీలో రోడ్ల పరిస్థితి ఇదీ అని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: