పిలిచినా రాలేదు.. కేసీఆర్ పై తమిళిసై గుర్రు?

తెలంగాణలో గవర్నర్ సీఎం మధ్య వివాదం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని రోజులుగా ప్రగతిభవన్‌కూ రాజ్‌భవన్‌కూ మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. అసలు గవర్నర్‌ను కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయడం లేదన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి బీజేపీతో పోరాటం ప్రారంభించాక ఈ ధోరణి మరింత ఎక్కువైందనే చెప్పాలి. ఎంతగా అంటే.. అసలు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సమయంలో గవర్నర్ ప్రసంగమే లేకుండా చేసేంతగా గవర్నర్‌ పట్ల కోపం ప్రదర్శిస్తున్నారు.

అయితే.. ఈ కోపం కేవలం గవర్నర్ మీద మాత్రమే కాదన్న సంగతి కూడా గమనించాలి. బీజేపీపై పోరాటం సాగించే క్రమంలో గవర్నర్‌ను కూడా కేసీఆర్ దూరం పెడుతున్నారు. తాజాగా రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు ఈ ఇద్దరి విబేధాలకు మరోసారి సాక్ష్యంగా నిలిచాయి. ఏటా ఉగాది సమయంలో రాజ్‌భవన్‌లో వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలకు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్షనేతలు హాజరవుతారు. అదో సాంప్రదాయం కానీ.. ఈసారి సీఎం కానీ మంత్రులు కానీ అటువైపు చూడలేదు.

ఈ అంశంపై గవర్నర్ కూడా అసహనంతో స్పందించారు. తన ఆహ్వానాన్ని గౌరవించనందుకి తాను ఏమీ బాధపడడం లేదంటూనే అసహనం వెలిబుచ్చారు. సీఎం సహా  119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించాను.. కొందరు వచ్చారు.. రాని వారి గురుంచి నేను చెప్పేది ఏమి లేదంటున్నారు తమిళిసై. తనను ప్రగతి భవన్ ఉగాది కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్ ని పక్కన పెట్టి మరీ వచ్చేదాన్నని గవర్నర్ తమిళిసై అంటున్నారు.

అంతే కాదు.. ఇటీవల జరిగిన యాదాద్రి పునఃప్రారంభ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించ లేదని.. పిలిస్తే వెళదామనే తాను అనుకున్నానని పాపం.. తమిళిసై అంటున్నారు. తాను వివాదాస్పదం చేసే వ్యక్తి ని కాదని కానీ.. కొన్ని అంశాల పై డిఫరెన్సెస్ ఉన్నాయని తమిళి సై అంగీకరించారు. తాను ఎన్ని సార్లు ఆహ్వానాలను పంపిన పట్టించుకోవడం లేదని.. తనను ఇగ్నోర్ చేశారని ఆమె వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: