తాను దూర సందు లేదు.. మ‌ళ్లీ మొద‌లెట్టిన ష‌ర్మిల‌..!

VUYYURU SUBHASH
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత ష‌ర్మిల రెండో విడ‌త పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. కొవిడ్ విజృంభ‌ణ‌, రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల త‌న పాద‌యాత్ర‌కు చాలా విరామం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాతో మొద‌లు పెట్టిన త‌న తొలి విడ‌త పాద‌యాత్ర మ‌ధ్యంత‌రంగా ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా న‌ల్ల‌గొండ జిల్లా న‌కిరేక‌ల్ నుంచి రెండో విడ‌త పాద‌యాత్ర ప్రారంభించారు. ఇది ఎన్నిక‌ల వ‌ర‌కు నిరంత‌రంగా సాగుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు తెలిపారు.

అయితే ష‌ర్మిల పాద‌యాత్ర‌పై పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో నైతే బోలెడు మీమ్స్ పేలుతున్నాయి. తాను దూర సందు లేదు.. మెడ‌కేమో డోలా.. అని తెలంగాణ ప్ర‌జ‌లు నిష్టూరాలాడుతున్నారు. ష‌ర్మిల ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో అర్థం కావ‌డం లేద‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఆమెను ఆంధ్ర మ‌హిళగానే చూస్తున్నార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.  

తెలంగాణ రాజ‌కీయాల్లో గ్యాప్ ఏమాత్రం లేద‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తే అవ‌గ‌త‌మ‌వుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ మ‌రోసారి అధికార‌మే ల‌క్ష్యంగా స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు నేత‌లంద‌రూ జిల్లాల్లోనే మ‌కాం వేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇటీవ‌ల త‌ర‌చూ జిల్లా ప‌ర్య‌ట‌న‌ల్లో గ‌డుపుతున్నారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు నిర్వ‌హిస్తూ ఫుల్ బిజీ అయ్యారు. గెలుపు బాట ప‌ట్టేందుకు రాజ‌కీయ స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిశోర్ ను కూడా తెచ్చుకున్నారు.

ఇక బీజేపీ ఎన్న‌డూ లేనంత స్వింగ్ లో క‌న‌ప‌డుతోంది. పైన మోడీ.. కింద బండి పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌మ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో గులాబీ పార్టీని ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో విజ‌య బావుటా ఎగుర‌వేశారు. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో నాలుగింటిని త‌మ ఖాతాలో వేసుకున్నారు. త‌మ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అని చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే త‌మ కార్య‌క‌లాపాలు ముమ్మ‌రం చేశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ ను వెన‌క్కునెట్టి ముందుకు సాగుతున్నారు.

ఇక మ‌రో ప్ర‌ధాన పార్టీ కాంగ్రెస్ కూడా ప్ర‌స్తుతానికి పోటీలోనే ఉంది. దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీ భ‌విష్య‌త్తుపై నీలినీడ‌లు క‌మ్ముకున్న‌ప్ప‌టికీ తెలంగాణ‌లో బ‌ల‌మైన నాయ‌కులు, క్యాడ‌ర్ ఉండ‌డంతో త‌క్కువ అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి. గ్రామ స్థాయి నుంచి నిర్మాణాత్మ‌క‌మైన కార్య‌క‌ర్త‌లు ఉండ‌డం అద‌న‌పు బ‌లం. రేవంత్ దూకుడుతో పార్టీ రేసుగుర్రంలా ప‌రుగెడుతున్నా నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేక‌పోవ‌డం.. తాజాగా ఇత‌ర రాష్ట్రాల్లో ఆ పార్టీ అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో కాస్త మైన‌స్ అయ్యేలా క‌న‌ప‌డుతోంది.

అయినా అధికార పార్టీ టీఆర్ఎస్ అంత బ‌ల‌హీనంగా కూడా ఏమీ లేదు. మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ఏమైనా తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తే త‌ప్ప గులాబీ పార్టీకి ఢోకా లేన‌ట్లే. బీజేపీ, కాంగ్రెస్ మ‌రీ ఎక్కువ‌గా పోటీ ఇస్తే హంగ్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇంత‌టి ప‌రిస్థితుల మ‌ధ్య‌.. పొలిటిక‌ల్ గా గ్యాప్ లేని స‌మ‌యంలో ష‌ర్మిల పార్టీపై ఎవ‌రికీ పెద్ద‌గా ఆస‌క్తి లేకుండా పోయింది. త‌న పాద‌యాత్ర ద్వారా జ‌నంలో సానుకూల‌త వ‌చ్చినా అది ఓట్ల రూపంలో రావ‌డం చాలా క‌ష్టం. అదే జ‌రిగితే తెలంగాణ‌లో సీఎం అవ్వాల‌న్న‌ ష‌ర్మిల ఆశ‌లు అడియాశ‌లే అవుతాయి. మ‌రి ష‌ర్మిల ధీమా ఏమిటో.. మూడు ప్ర‌ధాన పార్టీల‌ను ఎలా ఢీకొంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: