వావ్ కేసీఆర్‌.. ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌తోనే కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టేశారుగా...!

VUYYURU SUBHASH
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా దాదాపు 80 వేల ఉద్యోగాల‌కు పైగా ప్ర‌క‌ట‌న‌లు జారీ చేస్తామ‌ని తెలిపారు. త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ లు విడుద‌ల చేసి ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలు విడుద‌ల కానుండ‌డం ఇదే తొలిసారి. ఉమ్మ‌డి ఏపీలో కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. దీంతో గులాబీ శ్రేణుల‌తో పాటు నిరుద్యోగుల సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఫొటోల‌కు పాల‌భిషేకాలు నిర్వ‌హించారు.
ఒక రోజు ముందు వ‌న‌ప‌ర్తి స‌భ‌లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని.. తెలంగాణ ప్ర‌జానీకం మొత్తం రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు టీవీలు పెట్టుకొని చూడండ‌ని మంగ‌ళ‌వారం సూచించారు సీఎం కేసీఆర్‌. కానీ అంద‌రూ ఉద్యోగాల సంఖ్య 50 నుంచి 60 వేల మ‌ధ్య ఉండొచ్చ‌ని అంచ‌నా వేశారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేశారు కేసీఆర్‌. ఏకంగా 80 వేల‌కు పైగా ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని అసెంబ్లీలో తెలిపారు.
ఈ ప‌రిణామంతో విప‌క్షాలు కంగుతిన్నాయి. కేసీఆర్ ఈ స్థాయిలో ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేక‌పోయారు. ఈ అంశంపై ఏం మాట్లాడాలో కూడా తెలియ‌నంత గంద‌ర‌గోళంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప‌డిపోయారు. ఇది మోస‌పూరిత ప్ర‌క‌ట‌న అని.. ల‌క్ష‌ల్లో ఖాళీలు ఉంటే కేవ‌లం వేల‌ల్లో భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పార‌ని స‌న్నాయి నొక్కులు నొక్కారు. నిరుద్యోగ భృతి ప్ర‌క‌టించ‌లేద‌ని విమ‌ర్శించారు. అయితే నిరుద్యోగుల సంబ‌రాల‌తో విప‌క్షాల‌ ఆరోప‌ణ‌ల‌న్నీ దూదిపింజ‌ల్లా తేలిపోయాయి.
కేసీఆర్ ఉద్యోగాల ప్ర‌క‌ట‌న ముఖ్యంగా కాంగ్రెస్ లో చిచ్చు రాజేసింది. పార్టీ ప‌రంగా ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియ‌క ఎవ‌రికివారు ఒక్కో విధంగా స్పందించారు. సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి అందులోని లోపాల‌పై ప్ర‌శ్నించారు. కానీ సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మాత్రం కేసీఆర్ ను మెచ్చుకున్నారు. అపాయింట్‌మ్మెంట్ ఇస్తే కేసీఆర్ ను స‌న్మానిస్తాన‌ని తెలిపారు. దీంతో పార్టీలో ఐక్య‌త డొల్ల‌త‌న‌మేన‌ని మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ‌ది. కానీ కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం జ‌గ్గారెడ్డి ఇలాంటి అవ‌కాశం కోస‌మే ఎదురుచూస్తున్నార‌ని.. ఆయ‌న టీఆర్ఎస్ లో చేరేందుకే నిర్ణ‌యించుకున్నార‌ని అనుమానిస్తున్నాయి.
మ‌రోవైపు ఇదే అద‌నుగా మ‌రో ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల రెడ్డి బీజేపీ నేత వివేక్ తో భేటీ అయ్యారు. గురువారం ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు రానుండ‌డంతో బీజేపీలోకి వెళ్లేందుకే మార్గం సుగమం చేసుకున్నార‌ని స‌మాచారం. ఇలా కాంగ్రెస్ కు ఒకే రోజు ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో పార్టీ భ‌విష్య‌త్తుపై మ‌రోసారి నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. కేసీఆర్ ప్ర‌కట‌న కాంగ్రెస్ లో చిచ్చుకు కార‌ణ‌మైంద‌ని పార్టీ శ్రేణులు గుస‌గుస‌లాడుతున్నాయి. ఈ అంశంపై రేవంత్ ఎలా ముందుకు వెళతారో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: