రేవంత్ వ్యాఖ్య‌ల‌తో బిహార్ లో సెగ‌లు..!

VUYYURU SUBHASH
ముఖ్య‌మైన ప‌ద‌వుల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాలి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. లేదంటే ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. లేని పోని గొడ‌వలు తెచ్చి పెడ‌తాయి. ప్ర‌స్తుతం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అలాంటి స్థితినే ఎదుర్కొంటున్నారు. తెలంగాణ‌లోని బిహార్ అధికారుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి అంద‌రి ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు.
రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో డిజిట‌ల్ స‌భ్య‌త్వ నమోదుపై కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రాన్ని బిహార్ ముఠా ఆక్ర‌మిస్తోంద‌ని.. ఇత‌ర రాష్ట్రాల ఐఏఎస్‌, ఐపీఎస్ ల‌కు తెలంగాణ‌లో పెద్ద పీట వేస్తున్నార‌ని స్థానికుల‌కు అప్రాధాన్య పోస్టులు కేటాయిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
సీఎస్ సోమేష్ కుమార్‌, డీజీపీ అంజ‌నీకుమార్, ఆరు శాఖ‌లు క‌లిగి ఉన్న మునిసిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్‌.., ఎనిమిది శాఖ‌లు నిర్వ‌హిస్తున్న సందీప్ కుమార్ సుల్తానియా బిహార్ రాష్ట్రం నుంచి వ‌చ్చార‌ని.. వీరు స‌రిపోర‌న్న‌ట్లుగా కొత్త‌గా రాజ‌కీయ‌ స‌ల‌హాదారుగా ప్ర‌శాంత్ కిశోర్ ను తెచ్చి పెట్టుకున్నార‌ని.. ఈయ‌న కూడా బిహార్ రాష్ట్రం నుంచే వ‌చ్చార‌ని.. ఇలా తెలంగాణ ప్ర‌భుత్వంలో బిహార్ ముఠా రాజ్య‌మేలుతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రేవంత్‌. కేసీఆర్ పూర్వీకుల‌ది కూడా బిహారేన‌ని ఆరోపించారు.
రేవంత్ వ్యాఖ్య‌లు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తెచ్చినా.. దీనిపై ఇంటా బ‌య‌టా తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. తాజాగా రేవంత్ వ్యాఖ్య‌ల‌పై బిహార్ రాష్ట్రంలో కూడా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ది బిహార్ డీఎన్ఏ అన్న వ్యాఖ్య‌ల‌తో ఆ పార్టీకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. బిహార్ లోని అధికార ఎన్డీఏ రేవంత్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు ప‌ట్టింది. ఈ అంశంపై బిహార్ కాంగ్రెస్ శాఖ స్పందించాల్సిందేన‌ని స్ప‌ష్టం ఇచ్చింది.
దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డాయి. దీనికి ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. మొత్తంమీద రేవంత్ వ్యాఖ్య‌లు బిహార్ లోని సొంత పార్టీలోనే చిచ్చు రేపాయి. తెలంగాణ పార్టీ సీనియ‌ర్లు కూడా రేవంత్ దూకుడు త‌గ్గించాల‌ని.. అధిష్ఠానం ముకుతాడు వేయాల‌ని కోరుకుంటున్నారు. అధిష్ఠానం రేవంత్ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ అడుగుతుందా.. లేదా లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: