తెలంగాణలో ఆ అసెంబ్లీ సీటు య‌మా హాట్ గురూ...!

VUYYURU SUBHASH
వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ ఆస‌క్తిగా మార‌నుంది. ఖ‌మ్మం జిల్లాలో భాగ‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గం వ‌చ్చే సారి విభిన్న తీర్పు ఇవ్వ‌నుంది. పాలేరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌. నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక సార్లు జెండా ఎగ‌రేసింది ఆ పార్టీ. ఆ త‌ర్వాత సీపీఐ మూడు సార్లు ఇక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వ‌హించింది.

పాలేరులో టీఆర్ఎస్ ప్ర‌భావం త‌క్క‌వే. ఇక్క‌డ 2016 ఉప ఎన్నిక‌లో మాత్ర‌మే ఆ పార్టీ విజ‌యం సాధించింది. అది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట రెడ్డి మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక ఇది. ఈ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలుపు కంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుదే విజయంగా భావించ‌వ‌చ్చు. కానీ ఈసారి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది.

ఎలాగైనా ఇక్క‌డి నుంచి గెలిచి తీరాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. కానీ ఆ పార్టీలోని వ‌ర్గ కుంప‌ట్లు నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. క్రితం సారి ఇక్క‌డి నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థి కందాళ ఉపేంద‌ర్ రెడ్డి గులాబీ గూటికి చేర‌డంతో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. కందాళ చేతిలో ఓడిపోయిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మ‌రోసారి ఇక్క‌డి నుంచే బ‌రిలో నిల‌వాల‌ని.. సొంత పార్టీలోని ప్ర‌త్య‌ర్థిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భావిస్తున్నారు. కందాళ మాత్రం సిట్టింగ్ స్థానం త‌న‌దేన‌నే ధీమాతో ఉన్నారు.

మ‌రో వైపు క్రితం సారి ఇక్క‌డి నుంచి గెలిచిన కందాళ ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేర‌డంతో కాంగ్రెస్ కు ఈసారి అభ్య‌ర్థే లేకుండా పోయారు. ద్వితీయ శ్రేణి నేత‌ల్లో బ‌ల‌మైన నేత‌ లేక‌పోవ‌డంతో హ‌స్తం పార్టీ ఆందోళ‌న‌గా ఉంది. అయితే ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన రాయ‌ల నాగేశ్వ‌ర‌రావు ఈ సీటుపై ఆశ‌లు పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మ‌రో ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. రాంరెడ్డి వెంక‌ట రెడ్డి సోద‌రుడైన దామోద‌ర్ రెడ్డిని పాలేరు నుంచి పోటీ చేయించాల‌ని.. సూర్యాపేట‌లో రేవంత్ అనుచ‌రుడైన ప‌టేల్ ర‌మేష్ రెడ్డికి టికెట్  ఇస్తే ఉభ‌య‌తార‌క‌రంగా ఉంటుంద‌ని భావిస్తోంది. అయితే సూర్యాపేట‌ను వ‌దిలి పాలేరు రావ‌డానికి దామోద‌ర్ రెడ్డి ఏమేర‌కు సుముఖ‌త వ్య‌క్తం చేస్తారోన‌నే అనుమానం పార్టీ శ్రేణుల్లో ఉంది.

అలాగే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల కూడా పాలేరు నుంచి బ‌రిలో దిగాల‌ని యోచిస్తున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో వైసీపీ ఒక ఎంపీ, మూడు స్థానాలు గెలుచుకోవ‌డంతో బ‌ల‌మున్న పాలేరు నుంచే అయితే బాగుంటుంద‌ని ష‌ర్మిల ఆలోచ‌న‌గా ఉంది. ఇక్క‌డి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని ష‌ర్మిల కుతూహ‌లంగా ఉన్నారు. మ‌రో ప్ర‌ధాన పార్టీ బీజేపీ పాత్ర ఇక్క‌డ నామ‌మాత్ర‌మే. చూడాలి మ‌రి ఎవ‌రెవ‌రికి టికెట్లు ద‌క్కుతాయో.. ఎవ‌రి ఆశ‌లు నెర‌వేరుతాయో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: