రేవంత్ పాద‌యాత్ర వెన‌క పెద్ద స్కెచ్చే ఉందే...!

VUYYURU SUBHASH
రేవంత్ అనుచ‌రులు, పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాద‌యాత్ర‌పై క్లారిటీ వ‌చ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని రేవంత్ భావిస్తున్నారు. క్యాడ‌ర్ లో ఉత్సాహం నింపేందుకు.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సుదీర్ఘ పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నుంచే మొద‌లు పెట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.
ఎన్నిక‌లు ఎంతో దూరంలో లేనందున ప్ర‌జల్లోకి వెళ్లేందుకు ఆయా పార్టీలు ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ప‌నుల పేరిట ఇప్ప‌టికే ముంద‌స్తు స‌న్నాహాలు చేసుకుంటోంది. సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ ఏదో ఒక కార్య‌క్ర‌మం పేరుతో జ‌నాల్లోనే ఉంటున్నారు. మ‌రోసారి అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు.
బీజేపీ కూడా ఆ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ను ముందు పెట్టి ప్ర‌ణాళిక న‌డిపిస్తోంది. ఇంత‌కుముందే ఒక విడ‌త పాద‌యాత్ర చేప‌ట్టిన బండి మ‌రో విడ‌తకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. తొలి విడ‌త ఇచ్చిన ఉత్సాహంతో మ‌రోసారి పాద‌యాత్ర ద్వారా అధికార పార్టీని ఢీకొట్ట‌బోతున్నారు. రెండో విడ‌త‌కు ఏకంగా 200 కి.మీ. మేర ల‌క్ష్యం విధించుకున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల కూడా తొలి విడ‌త పూర్తి చేసి రెండో విడ‌త‌ను ప్రారంభించ‌బోతున్నారు.
ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్ధంగా ఉండేందుకు ఈ పార్టీలు ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం వెనుక‌బ‌డే ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మ‌రిచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. స‌భ్య‌త్వాల న‌మోదు పేరిట హ‌డావుడి చేస్తోంది. సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న హ‌స్తం పార్టీకి తిరిగి లేచేందుకు పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌దు. రేవంత్ ప్ర‌స్తుతం అదే ప‌నిమీద ఉన్నారు. మ‌న ఊరు - మ‌న పోరు పేరిట నియోజక‌వ‌ర్గాల వారీగా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ శ్రేణుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.
అయితే.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇలాంటి స‌భ‌లు, స‌మావేశాలు స‌రిపోవ‌ని.. పాద‌యాత్రే ఉత్త‌మ‌మ‌ని పార్టీ నేత‌లు త‌ల‌పోస్తున్నారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఇప్ప‌టికే ఆ ప‌ని మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం పాద‌యాత్ర త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మైనా త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాన‌ని చెబుతున్నారు. అయితే భ‌ట్టి ఒక్క‌రే కాకుండా పార్టీ సీనియ‌ర్లు అంద‌రికీ ఇందులో భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని కోరుతున్నారు.
దీనిపై పార్టీలో ఏకాభిప్రాయం రావ‌డం లేద‌ట‌. పాద‌యాత్ర‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ట‌. సీనియ‌ర్ నేత‌లంద‌రూ ఎవ‌రికి వారు జిల్లాల్లో పాద‌యాత్ర‌లు చేస్తే బాగుంటుంద‌ని కొంద‌రు ప్ర‌తిపాదించ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం రేవంత్ ఒక్క‌రు రాష్ట్ర వ్యాప్త పాద‌యాత్ర చేస్తేనే బాగుంటుంద‌ని.. పార్టీకి ఊపు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్ణీత గ‌డువులో వ‌స్తేనే పాద‌యాత్ర‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే వీలుప‌డ‌ద‌ని నేత‌ల అభిప్రాయంగా ఉంది. చూడాలి మ‌రి రేవంత్ పాద‌యాత్ర ఎప్పుడు ఉంటుందో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: