కేసీఆర్ జీ చాణుక్యుని హోదా పాయే?

కేసీఆర్.. ఈ తరం నాయకుల్లో చాణక్యుడిగా పేరున్న నాయకుడు. ప్రత్యర్థులకు అందకుండా ఎత్తులు వేయడంలో.. ప్రత్యర్థుల ఎత్తులు చిత్తు చేయడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మళ్లీ ఎలా పుంజుకోవాలో.. విజయం వచ్చినప్పడు దాన్ని ఎలా డీల్‌ చేయాలో బాగా తెలిసిన వాడు. అందుకే అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనను సుసాధ్యం చేయగలిగాడు. సుసాధ్యమైన తెలంగాణలో వరుసగా రెండు సార్లు సీఎం పీఠం అధిరోహించగలిగాడు.

అయితే.. చాణక్యుడిగా ఇప్పటి వరకూ ఉన్న కేసీఆర్‌ క్రమంగా పట్టుతప్పుతున్నారా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా సంయమనం పాటించగలిగిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. కేసీఆర్‌ చాలాసార్లు ఈ విజ్ఞత పాటించాడు. అందువల్లే చాణక్యుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. కానీ.. ఇటీవలి కాలంలో కేసీఆర్‌ క్రమంగా విచక్షణ కోల్పోతున్నారా అనిపిస్తోంది. ప్రత్యేకించి ప్రత్యర్థి పార్టీ నేతల విషయంలో కేసీఆర్ సర్కారు కొన్నాళ్లుగా కఠినంగా వ్యవహరిస్తోంది.

ప్రజాసమస్యలపై స్పందించడం విపక్షాల బాధ్యత.. ప్రజాసమస్యలపై ఆందోళనలు చేయడం విపక్షాలు చేయాల్సిన పని.. కానీ.. అసలు తన ప్రభుత్వంలో ఆందోళనే చేయకూడదన్న రీతిలో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోంది. ఆ ఆందోళనలను ఆదిలోనే అణిచివేస్తోంది. అదేమంటే కోవిడ్ అంటూ కుంటి సాకులు చెబుతోంది. తాజాగా ఉద్యోగుల బదిలీల జీవోకు నిరసనగా తన పార్టీ కార్యాలయంలో జాగరణ దీక్షకు కూర్చున్న బండి సంజయ్‌ను తీవ్ర ఉద్రిక్తత మధ్య అరెస్టు చేశారు. కార్యకర్తలు అడ్డుకుంటున్నా సరే.. లాఠీచార్జ్ చేసి మరీ అరెస్టు చేశారు.

మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి విషయంలోనూ ఇలాగే జరిగింది. రచ్చబండ కార్యక్రమం నిర్వహిద్దామని బయలు దేరిన రేవంత్ రెడ్డిని ఇంటి వద్దే అరెస్టు చేశారు. అధికారం ఉంది కదా అని  కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడం వల్ల ఆయన హుందాతనమే పోతోంది. కేవలం ఓటమి గురించి భయపడేవారు మాత్రమే ఇలా.. విపక్షాలను టార్గెట్ చేస్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విషయంలో కేసీఆర్ పునరాలోచించుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: