ఈటల మార్క్‌: ఒక్క రాజీనామా.. ఎన్నో జీవితాల్లో వెలుగులు?

రాజీనామా.. రాజీనామా అంటే ఏంటి.. అస్త్ర సన్యాసం.. ఏమీ చేయలేక చేసే పని.. పని నుంచి విశ్రాంతి కోరడం.. ఇది సాధారణ అర్థం.. కానీ.. రాజకీయాల్లో రాజీనామా అర్థం, పరమార్థం రెండూ మారిపోతాయి.. రాజీనామా కొన్నిసార్లు ఓ బ్రహ్మస్త్రం అవుతుంది. రాజీనామా కొన్నిసార్లు పెను మార్పులు తెస్తుంది.. ఈ విషయం టీఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు.. ఎందుకంటే.. ఆ పార్టీ విజయాల్లో రాజీనామాలు ఓ భాగం.. రాజీనామాలు ఓ వ్యూహం.

విచిత్రం ఏంటంటే.. ఈ రాజీనామా పవర్ ఏంటో తెలిసిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు అదే రాజీనామా ఓ గుదిబండగా మారింది.. అదే సమయంలో అదే రాజీనామా ఎన్నో వర్గాలకు మేలు చేసింది.. అదే ఈటల రాజేందర్‌ రాజీనామా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా ఆయన చేసిన రాజీనామా ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపింది. ఈటల రాజీనామాతో ముందుగా బాగుపడుతున్నది హుజూరాబాద్ ప్రజలు.. ఎమ్మెల్యేగా ఈటల ఏం సేవలు చేశారో కానీ.. ఆయన రాజీనామా ద్వారా మాత్రం తన ప్రజలకు బాగా సేవలు అందిస్తున్నారు.

అవును.. ఇప్పుడు రాష్ట్రంలో హుజూరాబాద్‌ ప్రజలు వీఐపీలు.. వారికి అందని పథకం లేదు. అవును మరి.. వారి కోసం అప్పటికప్పుడు ఓ భారీ పథకమే రూపుదాల్చింది కదా. దళిత బంధు పథకం తక్షణ కర్తవ్యం హూజూరాబాద్‌ దళితుల ఓట్లు బుట్టలో వేసుకోవడమే కదా. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ప్రజలే కాదు నేతలు కూడా బాగు పడ్డారు. అవును మరి.. హుజూరాబాద్‌లో గతంలో ఈటలపై పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరి ఏకంగా ఎమ్మెల్సీ అయిపోయారు.

మరోనేత వకుళాభరణం కృష్ణమోహన్ బీసీ కమిషన్ ఛైర్మన్ అయ్యారు. రసమయి బాల్ కిషన్‌కు తెలంగాణ సాంస్కృతి వారధి ఛైర్మన్‌గా మరోసారి ఛాన్స్ దక్కింది. అంతేనా.. ఈ హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంగానే ఇప్పుడు దళిత అధికారులకు మంచి పదవులు దక్కుతున్నాయి. ఎన్నడూ పెద్దగా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు వెదికి మరీ వారికి పదవులు ఇస్తున్నారు. ఇలా ఈటల రాజీనామాతో మారిన జీవితాలు ఎన్నో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: