జూలై 23 ముహూర్తం ఎవ‌రికి..? విజ‌య‌సాయి ట్వీట్ సంచ‌ల‌నం..

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారం లోకి వ‌చ్చాక వ‌రుస‌గా టీడీపీ నేత‌ల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. స‌రిగ్గా గీత గీసి కొట్టిన‌ట్టు విప‌క్షంలోని కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రికీ చుక్క‌లు చూపిస్తోంది. అంతేకాదు.. గ‌తంలో త‌నమీదున్న కేసుల కార‌ణంగా సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం కేసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉండ‌టంతో అదేవిష‌య‌మై టీడీపీ నేత‌లు ఆయ‌న‌ను ట్రోల్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడదే కార‌ణ‌మేమో తెలియ‌దుగానీ ప్ర‌స్తుతం ఏపీ రాజకీయం అంతా ’23’ నెంబ‌ర్, శుక్ర‌వారాల చుట్టే తిరుగుతోంది. ఇక్క‌డ ’23’వ తేదీకి ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే రెండేళ్ల క్రితం మే 23వ తేదీన‌ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌టంతో టీడీపీ ఘోర‌ప‌రాజ‌యం పాలై అధికారం కోల్పోయింది. అంతేకాదు.. టీడీపీకి వ‌చ్చిన సీట్లు కూడా 23 మాత్ర‌మే. ఇప్పుడు వైసీపీ స‌ర్కార్ దాన్ని సెంటిమెంట్‌గా మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. 23వ తేదీ లేదా శుక్ర‌వారం రోజును చూసుకుని మరీ టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్న‌ట్టు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు నిరూపిస్తున్నాయి. ఇప్ప‌టికే అనేక సార్లు ఈ సెంటిమెంట్‌ను రిపీట్ చేసిన వైసీపీ.. ఇప్పుడు టీడీపీకి మ‌రో ప్రమాద హెచ్చ‌రిక‌ను జారీ చేయ‌డం రాజ‌కీయంగా ఉత్కంఠ క‌లిగిస్తోంది.
 ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది అంటూవైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తాజాగా టీడీపీని ఉద్దేశించి చేసిన వార్నింగ్‌తో కూడిన ఓ ట్వీట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. "23 వ‌తేదీ టీడీపీకి కాళ‌రాత్రి. రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని వ‌దిలిన రోజు. ఇప్పుడు జూలై 23వ తేదీ శుక్ర‌వారం వ‌స్తోంది. ఆ రోజుతో టీడీపీ పటాపంచ‌లేనా..?" అని విజ‌య‌సాయి ట్వీట్ చేశారు. విజ‌య‌సాయిరెడ్డికి ఢిల్లీ పెద్ద‌ల వ‌ద్ద ఉన్న ప‌లుకుబ‌డి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ట్వీట్ చూస్తే టీడీపీ పెద్ద‌లు గ‌తంలో చేసిన‌ అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి ఆధారాలేమైనా ద‌ర్యాప్తు సంస్థ‌ల వ‌ద్ద ఉన్నాయా..?  జూలై 23న దీనికి సంబంధించి సంచ‌ల‌న ప‌రిణామం ఏదైనా జ‌ర‌గ‌బోతోందా అన్న సందేహాలు త‌లెత్తుతున్నాయి. టీడీపీకి చెందిన కీల‌క నేత‌ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం స‌రిగ్గా శుక్ర‌వారం లేదా.. 23వ తేదీ చూసుకుని మ‌రీ అరెస్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇలాగే ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెంనాయుడును గ‌తేడాది జూన్ 12, శుక్ర‌వారం అరెస్ట్ చేసింది. ఆ త‌ర్వాత హ‌త్య కేసులో కొల్లు ర‌వీంద్రను జులై 3, శుక్ర‌వారం రోజే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సంగం డెయిరీ అక్ర‌మాల వ్య‌వ‌హారంలో ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత‌ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను కూడా ఏప్రిల్ 23, శుక్ర‌వారం రోజునే అరెస్ట్ చేశారు. అంతే కాదు.. ఆ మ‌ధ్య చంద్రబాబుకు నోటీసులు ఇస్తూ.. 23వ తేదీనే విచారణకు రావాల‌ని ఏపీ సీఐడీ కోరింది. దీంతో 23 లేదా శుక్ర‌వారం పేరు వింటేనే రాష్ట్రంలో టీడీపీ నేత‌లు ఉలిక్కిప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్లో చెప్పిన‌ట్టుగా జూలై 23 శుక్రవారం జ‌ర‌గ‌బోయే సంచ‌ల‌నమేంటో చూడాలిమ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: