పబ్జీకి బానిసై తల్లినే చంపేశాడు..

Deekshitha Reddy
ఆన్ లైన్ గేమ్స్ పిల్లల్ని ఎంతగా బానిసలు చేసుకుంటున్నాయో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. ఇప్పటి వరకూ ఆన్ లైన్ గేమ్స్ కి బానిసై.. అవి లేకుండా ఉండలేక, ఆ గేమ్స్ లో నెక్స్ట్ లెవల్ కి వెళ్లలేక ఆత్మహత్యలు చేసుకున్నవారి గురించి వార్తలు చదివాం. కానీ ఇక్కడో టీనేజర్ తన తల్లినే చంపేశాడు. పబ్జీ గేమ్ కి బానిసైన ఆ పిల్లవాడు చివరకు ఉద్రిక్తతకు లోనై తల్లినే కడతేర్చే కసాయిగా మారాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
16 ఏళ్ల పిల్లవాడు పబ్జీ గేమ్ కి బానిసయ్యాడు. ఆ ఆట ఆడొద్దని, చదువుపై దృష్టి పెట్టాలని తల్లి ఎన్నిసార్లు మందలించినా అతడు వినలేదు. చివరకు ఆ ఆటకు అతను పూర్తిగా బానిసయ్యాడు. తిండి, నిద్రపై కూడా అతనికి పట్టేవి కావు. 24 గంటలు పబ్జీ గేమ్ ఆడుతూ ఉండేవాడు. చివరకు తల్లి ఓరోజు గట్టిగా మందలించడంతో అతను ఆగ్రహం పట్టలేక ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. తండ్రి సైన్యంలో పనిచేస్తాడు, ఇంట్లో తల్లి సంరక్షణలో పనిచేసే ఆ కుర్రాడు చివరకు, ఆమె చెప్పిన మాటలు వినకుండా ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు.
కట్టుకథ..
తల్లిని చంపడమే కాదు, ఆ నేరం నుంచి తప్పించుకోడానికి ఓ కట్టుకథ కూడా అల్లాడు ఆ కుర్రాడు. తల్లిని చంపిన తర్వాత పశ్చిమబెంగాల్ లో సైన్యంలో పనిచేస్తున్న తండ్రికి సమాచారమిచ్చాడు ఆ కుర్రాడు. ఎవరో కొందరు దుండకులు తల్లిని హత్య చేశారని కట్టుకథ అల్లాడు. దీంతో అతని తండ్రి చుట్టుపక్కలవారికి, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లి శవం కుళ్లిన వాసన వస్తుండటంతో ఆ పిల్లవాడు సెంట్ స్ప్రే చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ బాలుడిని కాస్త గట్టిగా ప్రశ్నించారు. దీంతో తాను చేసిన నేరం అంగీకరించాడు. తల్లిని తానే చంపేశానని ఒప్పుకున్నాడు. పబ్జీ మైకంలో తల్లి చెప్పిన మాటలు తనకు రుచించలేదని, అందుకే క్షణికావేశంలో తల్లిని తుపాకీతో కాల్చి చంపానని చెప్పాడు ఆ బాలుడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తండ్రి తుపాకీ ఇంటిలో ఉండటంతో.. దాన్ని తీసుకుని తల్లిని కాల్చానని చెప్పాడు ఆ బాలుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: