ఆ విషయంలో తెలంగాణ పోలీసులు విఫలం!?

N.Hari
తెలంగాణలో మహిళల  అక్రమ రవాణా కేసులు కలకలం రేపుతున్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల అక్రమ రవాణా విషయంలో గత ఏడాది దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ ఉందని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అమాయక యువతులను కొన్ని ముఠాలు లక్ష్యంగా చేసుకుని అక్రమ దందా సాగిస్తున్నట్లు వెల్లడైంది. ఉద్యోగాల పేరుతో యువతులు, మహిళలను కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లుగా గుర్తించారు. ఈ తరహా కేసులు ఇప్పుడు అలజడి రేకెత్తిస్తున్నాయి.
2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులు 1,651గా రికార్డు అయ్యాయి . తెలంగాణతో సహా మహారాష్ట్రలో అత్యధికంగా 184 కేసులు నమోదు అయినట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో 171 కేసులు రికార్డు అయ్యాయి. తెలంగాణలో మొత్తం కేసులు 184 నమోదు కాగా.. వాటిలో 752 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 105 కేసుల్లో విచారణ పూర్తి స్థాయిలో జరిగింది. కానీ రెండు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. పోలీసులు సరైన ఆధారాలు చూపించకపోవడం, నేర నిరూపణ చేయకపోవడంతో 103 కేసులను న్యాయస్థానం కొట్టేసింది.
నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో గణాంకాలను బట్టి మహిళల అక్రమ రవాణా కేసుల నిరూపణలో తెలంగాణ పోలీసులు ఘోరంగా విఫలం అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2020లో కోర్టుల్లో విచారణ జరిగిన కేసుల్లో శిక్షల శాతం 1.9 మాత్రమే ఉంది . తమిళనాడులో అత్యధికంగా  66.7 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో 25 శాతం, ఉత్తరాఖండ్‌లో 20 శాతం, ఝార్ఖండ్‌లో 19.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 8.2 శాతం కేసుల్లో శిక్షలు పడినట్టు లెక్క తేలింది. దీంతో ఉమెన్‌ ట్రాఫికింగ్‌ కేసుల్లోని నిందితులకు శిక్షలు వేయించడంలో తెలంగాణ పోలీసులు ఫెయిల్ అవుతున్నారన్న విమర్శలు, ఆరోపణలు తలెత్తాయి.
ఆర్ధికంగా వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలను కొన్ని ముఠాలు టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఎర వేసినట్లుగా వెల్లడైంది. డబ్బు ఆశ చూపి వ్యభిచారం కూపంలోకి నెడుతున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డు చేసిన గణాంకాల్లో తేలింది. చిన్నారులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని కూడా వెల్లడైంది. ఉమెన్‌ ట్రాఫికింగ్‌లో చిక్కుకుని యేటా వేల సంఖ్యలో అమాయకులు బలవుతున్నారు. అయితే మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం, ముఖ్యంగా ఉమెన్‌ ట్రాఫికింగ్‌కు చెక్‌ పెట్టడంలో, ఈ కేసుల్లో పట్టుబడిన నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో తెలంగాణ పోలీసులు విఫలం అవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: